టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటించిన బహుభాషా చిత్రం వారసుడు. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో మాత్రం మెగా నందమూరి సినిమాల దెబ్బకు ఏర్పడ్డ థియేటర్స్ ఇష్యుతో మూడు రోజులు ఆలస్యంగా జనవరి 14న వారసుడుని రంగంలోకి దించాడు దిల్ రాజు. తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి మూడు మాస్ సినిమాలని తట్టుకుని నిలబడే శక్తి తనకి ఉందంటూ దిల్ రాజు తొలి నుండి ధీమాగానే ఉన్నాడు. రాజు కెరీర్ బిగినింగ్ నుండి నమ్ముకున్న కుటుంబ ప్రేక్షకులనే ఈ సారి కూడా నమ్ముకున్నాడు. అయితే దిల్ రాజు నమ్మకం ఈ సారి ఫెయిల్ అవుతుందనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ.. అనూహ్యమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది వారసుడు. తెలుగులో కొన్ని కారణాలతో ఆశించిన సక్సెస్ దక్కకున్నా సౌత్ లోనే టాప్ గ్రాసర్ గా విజయ్ వారసుడు నిలిచింది.
పొంగల్ కి విడుదలైన అన్ని సినిమాల్లో వారసుడు అత్యధిక కలెక్షన్స్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలకు షాక్ ఇస్తూ.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది దిల్ రాజు చిత్రం. సంక్రాంతి విజేత వారసుడు కానుందని మీడియా ముఖంగా దిల్ రాజు విసిరిన సవాల్ నిజమైంది. మొత్తం మీద ‘వారసుడు’ ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇది కేవలం తమిళ వెర్షన్ కలెక్షన్ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా విజయ్ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేయడం వరుసగా ఇది ఏడోసారి. ‘వారిసు’ రూ.200 కోట్లకు పైగా వసూలు చేస్తే.. ఈ ఫీట్ సాధించిన విజయ్ ఆరో సినిమాగా ఇది నిలుస్తుంది. తొలిరోజు రూ.47 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిన ‘వారిసు’.. 12, 13 తేదీల్లో కాస్త వెనకబడింది. కానీ, శనివారం కలెక్షన్స్ మళ్లీ అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చింది. ఆదివారం కూడా ‘వారిసు’ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు రోజుల్లో రూ.70 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. మొత్తం మీద 5 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావటంతో సౌత్ బాక్సాఫీస్ బాస్ గా నిలిచాడు దిల్ రాజు.