మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా తన లేటెస్ట్ మూవీ టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. గుంటూరు టాకీస్ చిత్రంతో పేరు తెచ్చుకుని.. పిఎస్వి గరుడ వేగతో సక్సెస్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో వరుణ్ కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా రోపొందుతున్న ఈ చిత్రం యునైటెడ్ కింగ్డమ్లో భారీ షూటింగ్ షెడ్యూల్ను తాజాగా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ దాదాపు సగం విదేశాల్లోనే చిత్రీకరించారు. అయితే మిగితా యాక్షన్ సన్నివేశాలని కూడా యూకేలోనే ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేస్తున్నాడట.
ఇంతలోనే చిత్ర యూనిట్ వరుణ్, ప్రవీణ్ సినిమాకి ఒక టైటిల్ ని లాక్ చేసింది. అదే “గాండీవధారి అర్జున”. “విల్లు ధరించిన అర్జునా” అని అర్థమొచ్చే ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా అధికారికంగా విడుదల చేశారు. వరుణ్ తేజ్ జన్మదినం పురస్కరించుకుని టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పక్కా యాక్షన్ చిత్రం అనుకునేలా మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో.. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. అయితే మొన్న నాగార్జున, ప్రవీణ్ సత్తార్ ల కాంబినేషన్ లో.. భారీ అంచనాలతో విడుదలైన ‘ఘోస్ట్’ మూవీ డిజాస్టర్ తరువాత చేస్తున్న చిత్రం కావటంతో “గాండీవధారి అర్జున”పై మెగా ఫ్యాన్స్ కాస్త కలవరపడుతున్నారు.