నేడు వసంత పంచమి. చదువుల తల్లి సరస్వతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బాసరలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దెత్తెన తరలివస్తున్నారు. తెల్లవారు జాము నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలు మొదలు పెట్టారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కాగా ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఐ ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లతోపాటు దాదాపు మూడు వందల మంది పోలీసులు బందోబస్తును నిర్వహించనున్నారు. బాసర ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈసారి వసంతపంచమి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి మగ్గాలకు బాసరకు తీసుకొచ్చి ప్రత్యేకంగా చీరను సిద్ధం చేశారు. ఆ చీరనే నేడు వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి అలంకరించారు.