ఈరోజుల్లో ప్రతిదీ వాస్తు ప్రకారమే చేస్తున్నారు. ఇల్లు ప్లానింగ్ నుంచి మొదలుకుని పాత్రలు పెట్టే స్థలం వరకు అన్నీ కూడా వాస్తు ప్రకారం జరుగుతున్నాయి. ఏమాత్రం పొరపాటు చేసినా…తీవ్ర నష్టం చూడాల్సి వస్తుందన్న భయం ఉంటుంది. అయితే వాస్తు చూడాలంటే వాస్తు నిపుణులు ఉండాల్సిందే. వారి పర్యవేక్షణలోనే వాస్తు చూడాలి. వారు చెప్పినట్లుగానే పనులు చేయాల్సి ఉంటుంది.
అయితే వాస్తు శాస్త్రం కోర్సుకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పే విధంగా వాస్తు శాస్త్రం అనేది జీవావరణ శాస్త్రం. ఇది సానుకూలతను వ్యాప్తి చేయడానికి సహాయపడుతుంది. గ్రావిటీ ఫోర్స్, కాస్మిక్ ఎనర్జీ వంటి సబ్జెక్టులనుకూడా బోధిస్తారు. బెంగుళూరు, హైదరాబాద్ తోపాటు చాలా చోట్ల వాస్తు శాస్త్రంలో సర్టిఫికేట్ కోర్సును నిర్వహిస్తున్నారు. ఈ కోర్సు వ్యవధి 3 నుంచి 4 నెలలు. లేదంటే ఏడాది వరకు కూడా కంప్లీట్ చేయవచ్చు. ఈ కోర్సు చేసే వారికి అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ కోర్సులో అభ్యర్థికి వాస్తు శాస్త్రం గురించి క్షుణంగా బోధిస్తారు. అభ్యర్థులు సైన్స్ నేపథ్యం నుంచి వస్తే చాలు. దీని సాయంతో వారు వాస్తుశాస్త్రం యొక్క సూక్ష్మబేధాలను అర్థం చేసుకుంటారు. ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు ప్రధానంగా మూడు రకాల వాస్తులను బోధిస్తున్నారు. ఇందులో దేశీయ నిర్మాణం, వాణిజ్య నిర్మాణం, పారిశ్రామిక నిర్మాణం ఉన్నాయి. ఈ కోర్సు చేయాలంటే సెకండ్ పీయూ ఉత్తీర్ణులై ఉండాలి. 12వ తరగతిలో సైన్స్ లేదంటే పదోతరగతి వరకు సైన్స్ చదివి ఉండాలి. చాలా మంది ఈ కోర్సును హాబీగా కూడా చేస్తున్నారు. కానీ ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, బిల్డర్లు, సివిల్ ఇంజినీర్లు ఈ కోర్సు చేయడం వల్ల తమ నైపుణ్యాలను మరింత పెంచుకోవచ్చు.
వాస్తు శాస్త్ర జ్ఞానాన్ని బాగా నేర్చుకున్న తర్వాత, ఏ అభ్యర్థి అయినా తన ఇంటి నుంచే వాస్తు నిపుణుడిగా పనిచేయడం ప్రారంభించవచ్చు. పెద్ద పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు కూడా వారిని సంప్రదించవచ్చు. అంతేకాకుండా, మీరు ఏ సంస్థలోనైనా వాస్తు శాస్త్ర ఉపాధ్యాయునిగా కూడా బోధించవచ్చు. ఇంటీరియర్ డిజైనర్లు తమ ఫీల్డ్‌తో పాటు వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రతి నిర్మాణ పనికి వాస్తు శాస్త్ర అభిప్రాయం తీసుకోవడం చాలా ముఖ్యమైందని ప్రజలు భావిస్తున్నారు. అలా రోజురోజుకు ఈ రంగంలో ఎన్నో ఆప్షన్లు పుట్టుకొస్తున్నాయి.