VCgaru..Deliver the assurances of the students: Sabita Indra Reddy
mictv telugu

వీసీగారు..విద్యార్థుల హామీలను నేరవేర్చండి: సబితా ఇంద్రారెడ్డి

July 19, 2022

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసర ఆర్జీయూకేటీ విద్యార్ధులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇంఛార్జి వీసీ వెంకటరమణను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆర్జీయూకేటీ ఇంఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ సోమవారం మంత్రితో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా ఆర్జీయూకేటీలోని పలు సమస్యలపై వారు చర్చించారు.

అనంతరం పలు ఆదేశాలు జారీ చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని, బోధన, భోజన, వసతి పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా.. విద్యార్ధుల డిమాండ్లకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని వీసీని ఆదేశించారు. అంతేకాదు, విద్యార్ధుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

తాజాగా నాసిరకం సరుకులతో ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ భోజనం కారణంగా ట్రిపుల్‌ ఐటీలో పుడ్‌ పాయిజన్‌ జరిగి ఏకంగా 100 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు శనివారం సాయంత్రం వర్సిటీలో ఆందోళన చేశారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సుమారు 5వేల మంది విద్యార్థులు బైఠాయించారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్రమత్తమైయ్యారు. ఇటీవలే బాసర విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని వీసీకి ఆదేశాలు ఇచ్చారు.