కరోనాతో కొట్లాట.. రూ.100 కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో కొట్లాట.. రూ.100 కోట్ల విరాళం

March 22, 2020

fgnhmjn

కరోనా వ్యాప్తితో దేశం యావత్తు ప్రమాదపు అంచుల్లో ఉంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌తో పోరాడడానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని వేదాంత గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రకటించారు. దేశానికి అత్యవసరమైన అవసరం ఉన్నప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున నా వంతుగా రోజూవారి కూలీలకు, ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సహాయం చేస్తున్నానని తెలిపారు. 

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వంద కోట్లు ప్రకటిస్తున్నాను. ప్రస్తుతం మన నిర్ణయాలు దేశానికి అత్యంత కీలకం కానున్నాయి. చాలా మంది ప్రజలు అయోమయం, భయబ్రాంతుల్లో ఉన్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీల విషయంలో చాలా ఆందోళన చెందుతున్నా. నాకు సాధ్యమైనంత సాయం వారికి చేస్తాను’ అని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన ఉదాత్త హృదయానికి సోషల్ మీడియా వేదికగా నెటజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా పెద్దలు ముందుకు వచ్చినప్పుడే అసలైన హీరోలు అనిపించుకుంటారు’ అని అంటున్నారు.