‘నేను ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నా.. కానీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. నాదే అంతిమ విజయం..’ జనవరి 12వ తేదీ నుండి తప్పుకుంటూ దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. బాలకృష్ణ, చిరంజీవిల చిత్రాలు ఉన్న సంక్రాంతి సీజన్ కి డబ్బింగ్ చిత్రంతో దిల్ రాజు ముందుకొచ్చాడు. కాస్లీ థియేటర్స్, పేరున్న మల్టిప్లెక్స్ అన్నింటిని వారసుడు మూవీ కోసం బ్లాక్ చేసేశాడు దిల్ రాజు. సొంతంగా నిర్మించిన చిత్రం కావటంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంక్రాంతి సీజన్ నుండి తప్పుకోలేదు.
అయితే ఏం జరిగిందో, ఎవరు వార్ణింగ్ ఇచ్చారో కానీ, అనుకోకుండా జనవరి 12 డేట్ ని వదులుకుని.. జనవరి 14న వారసుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు దిల్ రాజు. చిరంజీవి, బాలకృష్ణల సినిమాలకు థియేటర్స్ కోసం నేను వారసుడుని పోస్ట్ ఫోన్ చేస్తున్నానంటూ ప్రకటించాడు. అయితే తనకి వారసుడుపై నమ్మకం ఉందని.. తన చిత్రానికే అంతిమ విజయం అంటూ మీడియా ముఖంగా ఛాలెంజ్ విసిరాడు దిల్ రాజు.
అయితే అగ్ర నిర్మాత నమ్మకం వమ్ముకాలేదు. వారసుడుకి తెలుగులో సో..సో టాక్ వచ్చినా దేశవ్యాప్తంగా టాప్ గ్రాసర్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఫస్ట్ వీక్ లోనే 200కోట్ల క్లబ్ లో చేరి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు అందనంత ఎత్తులో నిలిచింది. అయితే వారసుడుకి పాన్ ఇండియా రేంజిలో హిట్ టాక్ రావటంతో ఇప్పుడు తెలుగులో కూడా దిల్ రాజు ఎక్కడ తగ్గట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ వీరసింహారెడ్డి కంటే వారసుడు థియేటర్స్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వీరసింహంకి రోజురోజుకి కలెక్షన్స్ డ్రాప్ అవ్వడానికి కారణం వారసుడు చిత్రమే అని నందమూరి ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.
ఒకవైపేమో చిరంజీవి వాల్తేరు వీరయ్య 157కోట్ల గ్రాస్ కి చేరుకొని.. 200కోట్లకి పరుగులు పెడుతుంటే.. వీరసింహారెడ్డి మాత్రం 114.95 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయిందని ఫ్యాన్స్ వాపోతున్నారు. క్రేజ్ ఉన్న థియేటర్లలో వారసుడు సినిమాను రిలీజ్ చేయడంతో పాటు వీరసింహారెడ్డి కంటే ఎక్కువ థియేటర్లలో వారసుడు సినిమా ప్రదర్శితమవ్వటమే వీరసింహం కలెక్షన్స్ డ్రాప్ కి కారణమని అంటున్నారు.
హైదరాబాద్ లో వారసుడు 300 కంటే ఎక్కువ షోలు ప్రదర్శితమవుతుండగా వీరసింహారెడ్డి కేవలం 270 షోలు ప్రదర్శితమవుతోందని తెలుస్తోంది. బాలయ్య అభిమాన సంఘాల నాయకులు సైతం ఈ విషయంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ లాంటి ప్రాంతాలలో క్రేజ్ ఉన్న థియేటర్లలో వీరసింహారెడ్డి సినిమాను ప్రదర్శించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.