veeranarasimha reddy balakrishna tollywood movie review
mictv telugu

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ

January 12, 2023

veeranarasimha reddy balakrishna tollywood movie review

సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు వీరసింహారెడ్డి మూవీతో బాలయ్య ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంతో వచ్చిన కథలతో ఇప్పటికే బంపర్ హిట్లు కొట్టేశాడు కాబట్టి.. అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వీరసింహారెడ్డి ఆడియెన్సును ఏ మేరకు ఆకట్టుకోగలిగింది? థియేటర్లో ఎలాంటి రెస్పాన్సును దక్కించుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ ఏంటంటే..
జై సింహారెడ్డి (బాలక్రిష్ణ) ఇస్తాంబుల్ లో తల్లి (హనీ రోజ్)తో కలిసి జీవిస్తుంటాడు. అక్కడే ఈషా(శ్రుతిహాసన్)తో జై ప్రేమలో పడడంతో ఓసారి మీ అమ్మనానల్ని వచ్చి మాట్లాడమని ఈషా తండ్రి (మురళీ శర్మ) అడగడంతో.. ఇదే విషయాన్ని తల్లికి చెబుతాడు. అప్పటివరకూ తనకు తండ్రిలేడనుకుంటున్న జై సింహారెడ్డికి తల్లి ఓ నిజం చెప్తుంది. సీమ ప్రజల బాగు కోసం కత్తిపట్టిన వీరసింహారెడ్డి(బాలక్రిష్ణ)కి పుట్టిన బిడ్డవని చెప్తుంది. పెళ్లి విషయమై మాట్లాడడానికి ఇస్తాంబుల్ రమ్మని వీరసింహారెడ్డికి చెప్పడంతో తాను అక్కడికి వెళ్తాడు. సీమని వదిలివెళ్లాడని తెలుసుకున్న విలన్ ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) తన భార్య భానుమతి(వరలక్ష్మీ శరత్ కుమార్) తో కలిసి ఇస్తాంబుల్ వస్తాడు. ఆ భానుమతి స్వయానా వీరసింహారెడ్డి చెల్లెలే. పగ కోసం తన అన్నని చంపడానికి చూస్తుంటుంది. మరి వీళ్లు వీరసింహారెడ్డిని చంపేశారా? అసలు సొంత అన్న మీద చెల్లెలు భానుకెందుకంత పగ? తండ్రి గతాన్ని తెలుసుకుని శత్రువులకు జై సింహారెడ్డి ఎలా బుద్ధి చెప్పాడనేదే సినిమా అసలు కథ.

కథనం ఎలా ఉందంటే..
కథపరంగా రొటీనే అయినా కథనంలో, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో దర్శకుడు గోపీచంద్ మలినేని సక్సెసయ్యాడు. సాధారణంగానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో మాదిరిగానే ఫస్టాఫ్ లో కొన్ని సీన్సుని సెటప్ చేయడం, సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ద్వారా ఆడియెన్సుని ఎంగేజ్ చేసే ప్రక్రియలోనే ఈ సినిమా కూడా సాగుతుంది. చెప్పాలంటే ఫస్టాఫ్ లో పెద్దగా కథ ఏమీ లేకపోయినా బాలయ్య మార్క్ సన్నివేశాలు, ఆయన ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్సుని జోడించి బాగా తీశారు. శ్రుతిహాసన్, బాలక్రిష్ణ మధ్య లవ్ స్టోరీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయినా మిగతా సీన్లకే ప్రాముఖ్యతనిచ్చి వాటిపైనే ఫోకస్ పెట్టారు డైరెక్టర్ అండ్ టీమ్. చాలా చోట్ల లాజిక్కులు మిస్సయినా జై బాలయ్య అనుకోని కథలో ముందుకెళ్లిపోవడమే ఇక.

ఎవరెలా చేశారంటే..
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాల్లో, అందులోనూ డ్యూయల్ రోల్ ఉంటే బాలయ్య ఏ రేంజులో రెచ్చిపోతాడో తెలిసిందే. స్క్రీన్ మీద తను కనిపించినప్పుడల్లా ఫ్యాన్సుకి పూనకాలే. తన బాడీ లాంగ్వేజుకు, డిక్షన్ కు తగ్గ డైలాగులు, సీన్లు పడితే పాత్రని ఎంతలా ఎలివేట్ చేస్తాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక శ్రుతిహాసన్ కి కథ పరంగా పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఎంట్రీ సీను, రెండు పాటల్లో మాత్రం సందడి చేసింది. ఇక సినిమాకి ప్రధాన బలం సాయిమాధవ్ బుర్రా డైలాగులు. ఓవైపు కథని చెప్తూనే మరోవైపు ఫ్యాక్షన్ డైలాగుల్ని పండిస్తూనే, పొలిటికల్ పరంగా కూడా కనెక్టయ్యేలా చాలా సంభాషణలిచ్చాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో రామ్ లక్ష్మణ్ తమ స్టయిల్ ను మరోసారి వెండితెరపై పండించారు. ఇక రోటీన్ గ్లామర్ పాత్రలు కాకుండా డిఫరెంట్ రోల్స్ చేయాలని తపించే వరలక్ష్మీ శరత్ కుమార్ కి తగ్గ పాత్ర దొరికింది. సొంత అన్న మీద 30 ఏళ్లపాటు పగతో రగిలిపోయే పాత్రలో, ఫ్లాష్ బ్యాక్ లో అన్న గారాబంతో పెరిగిన చెల్లిగా డైమెన్షన్స్ చూయించింది. హనీ రోజ్ పాత్ర పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ మరోసారి చెవుల తుప్పు వదిల్చాడు. థియేటర్లో ఆర్ ఆర్ తో మోతమోగిస్తూ అభిమానులతో మాస్ జాతర చేయిస్తున్నాడు. మొత్తంగా ఆడియెన్స్ ఇప్పటికే చాలా రకాల ఫ్యాక్షన్ సినిమాల్ని చూసేసినా తనదైన మేకింగ్ తో ఆకట్టుకోగలిగాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

ఓవరాల్ గా ఎలా ఉందంటే..
బాలయ్య మార్క్ యాక్షన్, ఆయన స్టయిల్ ఆఫ్ ఫ్యాక్షన్ సినిమా చూడాలనుకునే ఫ్యాన్సుకి వీరసింహారెడ్డి విజువల్ ట్రీట్. పండక్కి ఓ ఊరమాస్ మూవీ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంచక్కా ఈ సినిమాని చూసేయొచ్చు. కథలో విపరీతమైన ట్విస్టులు, మూవీ మేకింగ్ లో విప్లవాత్మక మార్పులు కోరుకునే ప్రేక్షకులు కాస్త డిజప్పాయింట్ అయినా కమర్షియల్ గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దబిడి దిబిడే.