ఏపీలో ‘వీరసింహారెడ్డి’ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. నిబంధనల పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వేదికగా మరో చోటు చూసుకోమని చెప్పగా.. మూవీ మేకర్స్ వారు చెప్పినట్లే చేశారు. అయినా కూడా ఏవేవో కారణాలతో పలు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. చూడబోతే ఈ సినిమా ఈవెంట్‌కి పొలిటికల్ ఇష్యూ కారణమేమో అనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా వైసీపీ ఉండగా.. ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబుకి స్వయాన బావమరిది బాలకృష్ణ కావడంతో విడుదల కాబోయే సినిమాపై ఆంక్షలు పెట్టినట్లనిపిస్తోంది
ముందుగా అనుకున్నట్లు జనవరి 6వ తేదీన అంటే ఈ రోజున ఒంగోలు లోని ఏబీఎమ్ గ్రౌండ్స్‌లో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అయితే చివరి నిమిషంలో పేచీ పడి ఆ వేదిక రద్దయింది. అందుకు ముఖ్య కారణం ఏపీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన జీవో. ఈ ఈవెంట్ కి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేందుకు అవకాశం ఉందని, నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందనే కారణం చెబుతూ వేదిక మార్చుకోవాలని చెప్పారు ఏపీ పోలీసులు.
దీంతో చివరి నిమిషంలో నగరంలోని అర్జున్ ఇన్ఫ్రా (బీఎంఆర్ మహానాడు గ్రౌండ్) సెలక్ట్ చేసుకున్నారు సినిమా యూనిట్. ఈ క్రమంలో నిబంధనల పేరిట చుక్కలు చూపించారు పోలీసులు. గురువారం రాత్రి వరకు ఆంక్షల పేరిట పోలీసులు ముప్పతిప్పలు పెట్టారు. రాత్రి 10 గంటల వరకూ పాసులు ఇవ్వలేదు. వాటిపై స్టాంపింగ్ చేయాలంటూ స్వాధీనం చేసుకున్నారు.
మొదటి నుంచి ఏబీఎమ్ గ్రౌండ్స్‌లో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని.. గత 10 రోజులుగా శ్రేయాస్ మీడియా సంస్థ ప్రతినిధులు ఒంగోలులో అధికారులను కలుస్తూనే ఉన్నారు. కొత్త జీవో పేరుతో అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ముందుగా సెట్ చేసిన సామగ్రిని బుధవారం రాత్రి అప్పటికప్పుడు తొలగించాల్సివచ్చింది. వేడుకల నేపథ్యంలో ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి కొన్ని సూచనలిచ్చారు. బందోబస్తు విధుల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లవద్దని, ఎవరైనా అక్కడి ప్రముఖులతో ఫొటోలు దిగేందుకు తమ కార్యస్థలాలను విడిచి వెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది.