మాంసాహారవీర తెలుగు రాష్ట్రాలు.. ఇలాగైతే అంతే! - MicTv.in - Telugu News
mictv telugu

మాంసాహారవీర తెలుగు రాష్ట్రాలు.. ఇలాగైతే అంతే!

October 22, 2022

తెలుగువాళ్లు కేక పుట్టిస్తున్నారు. ఒక్క ఆదివారమే కాదు, అన్ని వారాలూ నాన్‌వెజ్ పండగే అనేస్తున్నారు. భోజనం అంటే ప్లేటులో ముక్కపడి తీరాల్సిందే. మాంసాహారుల సామ్రాజ్యాల్లో నిజంగానే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే శాకాహారి ఉంటున్నారు. జాతీయ ఆరోగ్య సర్వే(నేషనల్ హెల్త్ సర్వే) లెక్కలు ఈ ఘాటు మసాలా నిజాన్ని వెల్లడిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాంసాహార వినియోగం భయంకరంగా పెరిగిపోయింది.

కరోనా దెబ్బ నుంచి నాన్ వెజ్ కాపాడుతుందని ప్రచారం జరగడం, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, బిర్యానీ, కబాబ్స్ వంటి వాటి వినియోగం పెరగడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. 2019-2021 గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మాంసాహారుల జనాభా 97.3 శాతం. శాకాహారుల కేవలం 2.7 శాతమే. ఏపీలోనూ లెక్కలే నమోదయ్యాయి. తెలుగు ప్రజల్లో 73 శాతం మంది వారానికోసారైనా ముక్క నములుతున్నారు.

దీనికి సంబంధించి దేశవ్యాప్త సగటు 51శాతం. కోడిగుడ్డు మాంసాహారమా, శాకాహారమా అన్న పురాతన చర్చను గుర్తు చేసుకుంటే 4.4 శాతం మంది పాపం వాటితో సరిపెట్టుకుంటున్నారు. దేశ జనాభాలో 19 శాతం మంది గుడ్లే కాదు, చేపలు, చికెన్, రొయ్యలు వంటి ఏ రకం మాంసాన్నీ ముట్టడం లేదు. 29 రాష్ట్రాల్లో ఏడు లక్షల మంది స్త్రీలు, 93 వేల మంది పురుషులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలు చెప్పారు. రాజస్తాన్, హరియాణా, గుజరాత్, పంజాబ్ తప్ప దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో మాంసాహార వినియోగం భారీగా పెరిగింది.