రైతు బజార్లకు క్యూ కట్టిన ప్రజలు..ధరలు పెంచేసిన వ్యాపారులు - MicTv.in - Telugu News
mictv telugu

రైతు బజార్లకు క్యూ కట్టిన ప్రజలు..ధరలు పెంచేసిన వ్యాపారులు

March 23, 2020

Vegetable

జనతా కర్ఫ్యూ తర్వాత కూరగాయ మార్కెట్లు తెరుచుకోవడంతో ప్రజలు క్యూ కట్టారు. ఈనెల 31వ కు లాక్ డౌన్ ప్రకటించడంతో కూరగాయలు కొనడం కోసం పెద్ద ఎత్తున మార్కెట్లకు చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసిన రైతు బజార్లు జనంతో కిక్కిరిసి పోయాయి. పది రోజులకు సరిపడా ఒకేసారి కూరగాయలు, పండ్లు, నిత్యావసరాలు తీసుకెళ్తున్నారు. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతున్నారు. ఒక్కసారిగా ధరలు పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

ఉదయం గతంలో ఉన్న ధరలకు అమ్మిన వ్యాపారులు, 9 గంటలు దాటగానే రేట్లు పెంచారు. ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. నిన్న మొన్న వరకూ కిలో టమాటా రూ. 10 పలకడా ఒక్కసారిగా రూ. 40కి పెంచేశారు. కిలో పచ్చి మిర్చి ధర రూ. 25 ఉండగా, ఇప్పుడు రూ. 90కి చేరింది. వంకాయ రూ.80కి అమ్ముతున్నారు.  ప్రభుత్వాలు ధరలు పెంచకూడదని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఈ పెంపు విషయంపై సరూర్ నగర్ మార్కెట్లో వినియోగదారులకు, కూరగాయల వ్యాపారులకు మధ్య  కొంత సేపు వాగ్వాదం కూడా జరిగింది. 

ఒక్కసారిగా రేట్లు పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిఘా పెట్టి ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో వ్యాపారులు ఇలా చేయడం సరికాదని అంటున్నారు. కానీ వ్యాపారుల వాదన మాత్రం మరోలా ఉంది. లాక్ డౌన్ కారణంగా కూరగాయలు, పండ్లు మార్కెట్లకు చేరడం లేదని, దీని కారణంగా ధరలు పెరిగాయని అంటున్నారు.