Vegetable seller Ravikumar died in Agra
mictv telugu

క్షణాల్లో ప్రాణం తీసిన ఒక్క మాట.. వైద్యులు కూడా మా వల్ల కాదనేశారు

October 18, 2022

తెలుగు సినిమాల్లో చూపించే విధంగా ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య జరిగింది. వీధి వ్యాపారుల వద్ద మామూళ్లు వసూలు చేసే రౌడీలు, గుండాలు మామూళ్లు ఇవ్వని వారిని హింసిస్తుంటారు. మొండికేస్తే బహిరంగంగా చంపేస్తారు. సేమ్ ఇలాంటి సీన్ ఆగ్రాలో చోటు చేసుకుంది. మామూళ్లు ఇవ్వనని తెగేసి చెప్పినందుకు ఓ వీధి వ్యాపారిని పట్టపగలు, అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి చంపేశాడు. ఇదే దారుణం అనుకుంటే చివర్లో వైద్యులు ట్విస్ట్ ఇచ్చి ప్రాణాలు కోల్పోయేందుకు తమ వంతు సహకారం అందించారు. బాధిత కుటుంబం చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఎత్మద్ ఉద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ సయూద్ ప్రాంతంలో రవికుమార్ అనే వ్యక్తి వీధిలో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. ఆ ప్రాంతంలో పేరు మోసిన వీధి గుండా మనోజ్ దివాకర్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి మామూలు వసూలు కోసం వచ్చి రవికుమార్‌ను మొదటగా గుట్కా అడిగాడు. లేదని సమాధానం ఇవ్వగా ఆగ్రహానికి గురైన దివాకర్.. ఈ ప్రాంతంలో ఇక కూరగాయలు అమ్మలేవని బెదిరించాడు

. తర్వాత తన కారు వద్దకు వచ్చి రోడ్డుపైనే షాపు ముందు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. దుకాణం ముందు తాగితే బేరాలు పోతాయని రవి అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉన్మాదానికి లోనైన దివాకర్ కారులోంచి కత్తి తీసి రవికుమార్ ఛాతీలో పొడిచాడు. దీంతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రవికుమార్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ సమస్య తలెత్తింది. కత్తి గాయాలు చూసి వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. ఇలా ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో రవికుమార్ ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఓ డాక్టర్ పరిశీలంచి చనిపోయాడని నిర్ధారించడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు దివాకర్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.