వెంకయ్యా.. ఇదేం భాష! - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్యా.. ఇదేం భాష!

December 9, 2017

ఒకపక్క తెలుగు భాష ప్రచారం, దాని ఘనతను గుర్తు చేసుకోవడానికి తెలుగు ప్రపంచ మహాసభలు జరుపుకుంటూ ఉంటుంటే మరోపక్క.. ఉల్టాగా వేరే భాష ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దేశంలో హిందీని అధికారిక భాషగా రద్దుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన ఒక ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెంకయ్య శుక్రవారం విశాఖ జిల్లాలోని చేపలుప్పాడ గ్రామాన్ని సందర్శించారు. ఈ  గ్రామం పేరు బాగాలేదని, దాన్ని ‘నారాయణ మత్స్యపురి’గా మార్చాలని అధికారులకు చెప్పారు. దీంతో అక్కడున్న వారు నోరెళ్లబెట్టారు. ఈ వార్త మీడియాలో రావడంతో పలువురు తెలుగు పండితులు మండిపడుతున్నారు. తరతరాలుగా వస్తున్న తెలుగు పేరును మార్చడం సబబు కాదని అంటున్నారు.

చక్కని తెలుగులో చేపలుప్పాడ అని ఉన్న పేరును కష్టంగా పలికాల్సిన  మత్స్యపురిగా మార్చడం సరికాదని అన్నవరపు వెంటకకృష్ణ అనే తెలుగు ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు. హిందీ జాతీయ భాష అని సాగుతున్న ప్రచారం అబద్ధమని, అది కేవలం దేశ అధికార భాషల్లో ఒకటి మాత్రమేనని ఆయన చెప్పారు.

కాగా, చేపలుప్పాడ గ్రామంలో వెంకయ్య రూ. 8.50 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. తుపాను ఆశ్రయం, పంచాయతీ భవనం, మంచినీటి పథకం మొదలైనవి ఇందులో ఉన్నాయి. కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు గంటా, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.