రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు.. నేడు ప్రకటించే అవకాశం - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు.. నేడు ప్రకటించే అవకాశం

June 21, 2022

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంపై చర్చించేందుకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా వెంకయ్య నివాసానికి చేరుకున్నారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. నేటి సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్ధి కోసం బీజేపీ పలువురు కేంద్రమంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 14 మంది ఇతర నాయకులతో కలిసి ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీతో నడ్డా ఆదివారం భేటీ అయ్యారు. కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు కూడా ఉన్నట్టు సమాచారం. దీని ద్వారా పార్టీ దక్షిణాదిలో బలపడుతుందని, తమిళనాడుపై కూడా ఈ ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాల ఓ అంచనా. ఇక వెంకయ్యనాయుడు నిలబడితే ప్రతిపక్షాలు కూడా సులువుగా ఒప్పుకుంటాయనీ, ఎన్నిక ఏకపక్షంగా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అటు, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా బరిలోకి దిగనున్నారు.