మోడీ మాట మేరకే ఉపరాష్ట్రపతి పదవికి ఒప్పుకున్న..! - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ మాట మేరకే ఉపరాష్ట్రపతి పదవికి ఒప్పుకున్న..!

July 28, 2017

జీవితంలో తానెప్పుడూ పదవుల కోసం ఆశపడలేదన్నారు ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు. 2020లో రాజకీయాల నుంచి  తప్పుకోవాలని భావించానన్నారు. కన్నతల్లి లాంటి పార్టీని వీడటం ఇష్టం లేకున్నా… ప్రధాని మోడీ మాట కాదనలేక ఉప రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో శత్రువులు ఎవరూ ఉండరని, ప్రత్యర్థులే ఉంటారని వెంకయ్య అన్నారు.

హైదరాబాద్ మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్ లో వెంకయ్య నాయుడుకి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సిహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మోహన్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు వెంకటేశ్, వెంకయ్యనాయుడి మిత్రులు, శ్రేయోభిలాషులు, పారిశ్రామికవేత్తలు, పలువురు నేతలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, నాయిని, మేయర్ రామ్మోహన్ వెంకయ్యనాయుడుకు చేనేత వస్త్రాలు, మొక్క, చార్మినార్ జ్ఞాపికను అందజేశారు.

పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఎంతో సహకరించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆగస్టు 16న రాష్ట్రంలో పర్యటించాలని ఆయనను కోరుదామనుకున్నానని, ఈ లోగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిందని తెలిపారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో పర్యటించాలని కోరుతానని చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలంటే తనకెంతో ఇష్టమన్నారు కేటీఆర్. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయనెంతో కృషిచేశారని కొనియాడారు