ఎందయ్యా..వెంకయ్య...రైతులంటే అంత అలుసా..? - MicTv.in - Telugu News
mictv telugu

ఎందయ్యా..వెంకయ్య…రైతులంటే అంత అలుసా..?

June 22, 2017

కేంద్రంలో బీజేపీ సర్కార్ వస్తే మంచి రోజులు వస్తాయనుకున్నారు. పంటలకు మద్దతు ధరలుంటాయని నమ్మారు. అచ్చే దిన్ అంటే ఆదరించారు. పాపం వాళ్లకేం తెలుసు…చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టడం తప్ప.కష్టాల్లో ఉన్న ఎవరినీ చేయి చాచి అడుగరు. ఉన్నంతలో నెట్టుకురావడమే వాళ్లకు తెలిసింది. ఉంటే పొలం పనిలో.లేదంటే మరో పనిలో. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత కష్టమొచ్చినా అదరడు. బెదరడు..తలవంచడు. విత్తనాల నుంచి ఎరువుల మీదుగా పంట మార్కెట్ కు వచ్చేవరకు అందరూ అన్నదాతనే ముంచేవారు. ఖద్దరు చొక్కాలేసుకున్నోళ్లు కూడా..అయినా మౌనంగానే అన్నీ భరిస్తూ వస్తున్నారు. అలాంటి రైతుల్ని పట్టుకుని అన్నేసి మాటాలంటావా..మంత్రి వెంకయ్య. సరే మీ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. యూపీ , మహారాష్ట్ర మినహా ఏయే రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారు..?

రుణమాఫీ ఇవ్వాలని రైతులు మిమ్ముల్ని అడిగారా…? ఒకవేల అడిగారే అనుకుందాం…మద్దతు ధరలు ఇస్తే రైతన్న ఆ మాట అనేవాడా. రూపాయికి దొరికే వస్తువు పదింతలు అయింది. కానీ రైతులు పండించే ధాన్యాన్నికి ఇప్పటికి మద్ధతు ధరల్లేవు. బీజేపీ సర్కారే కాదు..కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతే.పై గా డీమానిటైజేషన్ అంటూ రైతులకు కన్నీళ్లు తెప్పించారు. అప్పుడో ఇప్పుడో పెట్టుబడికి డబ్బుల్ని ఇచ్చే వ్యాపారుల్ని వారికి దూరం చేశారు.ఇక బ్యాంకుల సంగతి చెప్పనక్కర్లేదు. లోన్లు ఇవ్వరు..లోన్ ఇచ్చి.. అకౌంట్ లో వేసినా తీసుకోవాలంటే బ్యాంకుల్లో డబ్బులు ఉండవు. ఉన్న ఒక్క ఏటీఎం పని చేయదు. ఇన్నీ కష్టాలు కన్నీళ్లు వస్తున్న ఆపుకుంటూ ఏ సర్కార్ ని అన్నదాతలు పల్లెత్తుమాట అనడం లేదు. అలాంటి రైతుల్ని పట్టుకుని అన్నేసి మాటలు అనడం న్యాయమా..?

రుణమాఫీ అనేది ఇప్పుడో ఫ్యాషన్ గా మారిపోయిందా..? ఇంతకీ వెంకయ్య ఏమన్నాడంటే ‘‘రుణమాఫీ అనేది ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. మాఫీ అవసరమే కానీ తప్పనిసరి పరిస్థితుల తలెత్తినప్పుడు మాత్రమే రుణాలు మాఫీ గురించి ఆలోచించాలి. అయితే ఇదే చివరి పరిష్కారం కాదు. మీరు వ్యవస్థల క్షేమం గురించి కూడా అలోచించాలి. కరవు పరిస్థితులు తలెత్తినప్పుడు తప్పకుండా రైతులను ఆదుకోవాలి’’అని అన్నారు. అబ్బబ్బ ఏం మాట్లాడారు సారూ…ఈ మాటలు కార్పొరేట్లకు వినసొంపుగా ఉంటాయి. కడుపు కాలే రైతులకు కాదు. సరే మీరన్నట్టు తప్పని పరిస్థితులు ఏంటీ? మధ్యప్రదేశ్ రైతుల్లాగా ప్రాణాలు తీసుకోవాలా..? చివరి పరిష్కారమన్నారు..వోకే అదేంటో చెప్పితే బాగుండేది. ఇంకా ఏ వ్వవస్థల కోసం ఇంకా రైతులు త్యాగాలు చేయాలి..? రైతుల ఆత్మహత్యల్ని ఎలాగూ ఆపలేరు..పైగా రుణమాఫీ ఫ్యాషన్ అంటూ వారిని రెచ్చిగొడితే ఎలా..?

రైతులకు బ్యాంకులు మహా అంటే లక్ష. లక్షన్నరలోపే లోన్లు ఇస్తాయి. ఒక్కో చోటో ఇది 50 వేలకు కూడా మించదు. అదీ భూమిని తాకట్టు పెట్టుకుని మరి బ్యాంకోళ్లు అప్పు ఇస్తారు. పంటలు పండితే బ్యాంకోడు అడుగక ముందే రైతులు రుణాలు కట్టేస్తారు. అంతే గానీ విజయ్ మాల్యాలా బకాయిలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోలేరు. నిజంగా మీ సర్కార్ వ్యవస్థల క్షేమమే కోరితే మాల్యా ఎందుకు రప్పించడం లేదు. బకాయిలు ఎందుకు రాబట్టం లేదు. మాల్యా లాంటి ఎంతో మంది మాల్యాలు ఉన్నారు. అయినా వారిని ఎందుకు పట్టించుకోలేదు.

ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు ఎస్ బీ ఐ …ఎంతమంది మొండి బకాయిదారులైనా కార్పొరేట్లకు ఎన్ని వేల కోట్ల మాఫీ చేసిందో గుర్తులేదో..?ఇంకా ఎన్నివేల కోట్లు ఎగ్గొట్టారో తెలుసు కదా..మరి ఎందుకు వసూలు చేయడం లేదు. అలాంటోళ్లకే కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుంది. పాపం రైతన్న ఏం ఎగ్గొట్టాడని..దేశ సంపదను ఏం దోచుకున్నాడని.. రుణమాఫీ వద్దంటున్నారు. ఎలాగూ మీరివ్వడం లేదు..ఇచ్చే వారేవరైనా ఉంటే మీ మాటలతో వెనక్కి తగ్గొచ్చు. ఏ సర్కారైనా కార్పొరేట్ రుణాలు మాఫీ చేస్తుంది కానీ వ్యవసాయ రుణాలు చేస్తుందా..? మంత్రి వెంకయ్యనాయుడు మరిచిపోయినట్టున్నారు. అప్పట్లో బీజేపీ నేత దత్తాత్రేయ ..తిన్నది అరక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న మాటలు రెండు టర్మ్ లు పార్లమెంట్ కు దూరం చేశాయి. మీరూ ఎలాగూ పోటీ చేయరు కదా డోంట్ వర్రీ..కానీ ఇలా మాట్లాడితే సర్కార్ సీటుకే ఎసరు రావొచ్చు..జర జాగ్రత్త సారూ..రైతులు ఎవరి జోలికి పోరు. వాళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకోరు…