వెంకయ్యనాయుడును ‘ఎత్తి’ పక్కనపెడుతున్నారా? - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్యనాయుడును ‘ఎత్తి’ పక్కనపెడుతున్నారా?

July 17, 2017

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు

ప్రమోషన్ ఇచ్చారా? పక్కన పెట్టారా?

మోడీ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి లాభమా? నష్టమా?

ఏపీలో పార్టీ బాగుపడుతుంటున్న వెంకయ్య వ్యతిరేకులు

దక్షిణాదిలో బీజేపీకి నష్టం అంటున్న అభిమానులు

తెలుగు రాజకీయాల్లో అజాతశత్రువు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉండడంతో వెంకయ్య విజయం నల్లేరు మీద నడకే. అయితే ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వెంకయ్య ఉపరాష్ట్రపతి కావడం గురించి కాదు. మోడీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చాడా? లేక సగౌరవంగా తప్పించాడా? అన్నదాని గురించి చర్చించాలి. దీనికి ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో వెంకయ్య నాయుడు పోషిస్తున్న పాత్ర గురించి, ఫలితంగా బీజేపీ పొందుతున్న లాభ నష్టాల గురించి తెలుసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కించిత్ నష్టం కలగకుండా కాపాడే సహజ కవచకుండలం వెంకయ్యనాయుడు అన్నది బహిరంగ రహస్యం. బాబు చేత,బాబు కొరకు,బాబు ఎన్నుకున్న ఆణిముత్యం వెంకయ్యే అని చెప్పుకోవచ్చు. అమరావతి ప్రధానమంత్రిగా చంద్రబాబు సాగిస్తున్న పరిపాలనకు నాయుడు గారు అందిస్తున్న  సహకారం అంతా ఇంతా కాదు. విభజన హామిలను అమలుచేయించడానికి బాబు అష్టకష్టాలు పడుతున్నారని వెంకయ్య నాయుడు చూపిస్తున్న సినిమా విజయవంతంగా నడుస్తుంది. బాబును భుజాన మోస్తూ వెంకయ్య  పడుతున్న ఆపసోపాలతో పువ్వు పార్టీ అక్కడ ప్రసవ వేదన పడుతుంది. నా ఇధర్ కా నా ఉధర్ కా అన్నట్టుగా కమలాన్ని త్రిశంఖు స్వర్గంలో ఉంచిన ఘనత వెంకయ్యదే అన్నది ఆయన వ్యతిరేకుల మాట. ఇది ఆంధ్రా ముచ్చట అయితే తెలంగాణ విషయానికొద్దాం…..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వెంకయ్యకు మంచి సంబధాలు ఉన్నాయి. దీని ఫలితంగానే వెంకయ్య ఏమంటాడో అన్న భయంతో ఇక్కడి పువ్వు పార్టీ లీడర్లు, అధికార పార్టీని వీసమెత్తు మాట కూడా అనడం లేదన్నది ఆ పార్టీలో ఇంటర్నల్ టాక్. అందుకే ఇక్కడ ఆ పార్టీ అడ్రస్ వెతుక్కోవాల్సి వస్తోంది.

 ఇప్పుడిక మేయిన్ స్టోరీ

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందని ద్రాక్షగా ఉన్న దక్షిణాదిలో ఏదో ఒకటి చేయాలని మోడీ,అమిత్ షాలు మస్తు కోశిశ్ చేస్తున్నారు. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలో ఆర్ఎస్ఎస్ ను ఎగదోసి విద్వేషాలు రెచ్చగొట్టడంతో మొదలైన ఈ పరంపర, తమిళనాడులో జయలలిత మరణంతో ఒక రూపాన్ని తీసుకుంది. జయలలిత మరణాన్ని అవకాశంగా తీసుకున్న మోడీ అండ్ టీం,గవర్నర్ విద్యాసాగర్ రావును ముందుపెట్టి అన్నాడిఎంకేను విజయవంతంగా ముక్కలు చేసింది. ఎదగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే బలమైన ద్రావిడ భావజాలం కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పప్పులు ఉడకడం లేదు.అందుకే బీజేపీ కన్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై పడిందన్న వాదన ఉంది.  ఆంధ్రాలో ఉన్న కులతత్వం, తెలంగాణలోని ముస్లీం మెజార్టీని అవకాశంగా తీస్కొని బలపడొచ్చన్నది బీజేపీ భావన. అయితే ఈ ఈక్వెషన్ తో ఏదైనా ఫలితం పొందాలంటే ముందు వెంకయ్యను మైనస్ చేయాలన్నది మోడీ అసలు సూత్రం. అందులో భాగంగానే ఈ ఉపరాష్ట్రపతి.