విక్టరీ వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో కొత్త చరిత్ర లిఖించనున్నారు. ఇప్పుడు స్టార్ హీరోల గత సినిమాలు రీరిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. కానీ వెంకటేష్ విషయంలో అలా జరగడం లేదు. ఓటీటీలో విడుదలైన సినిమాను థియేటర్లో విడుదల చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ అసురన్ రీమేక్ గా తెలుగులో వచ్చిన నారప్ప చిత్రం ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. కరోనా లాక్ డౌన్ సమయంలో అలా చేయాల్సి వచ్చింది.
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా, వెంకటేష్ గెటప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు థియేటర్లో చూసి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయనున్నారు. దీంతో ఓటీటీలో విడుదలైన తర్వాత థియేటర్లో వస్తున్న తొలిచిత్రంగా నారప్ప నిలవనుంది. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో వెంకటేష్ కి భార్యగా ప్రియమణి నటించింది. నాజర్, రావురమేష్, రాజీవ్ కనకాల, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా గతేడాది జులై 20న ఓటీటీలో విడుదలైంది.