చీమ కుట్టి మహిళ మృతి.. ఫేక్ వార్త కాదు.. - MicTv.in - Telugu News
mictv telugu

చీమ కుట్టి మహిళ మృతి.. ఫేక్ వార్త కాదు..

April 4, 2018

వినడానికి వింతగా ఉంది కదా. కానీ నిజం! సౌదీ అరేబియాలో జరిగింది. కేరళకు చెందిన 36 ఏళ్ల సుశీ జెఫీ అనే మహిళను చీమ బలితీసుకుంది. మామూలు చీమ కాదు విషపు చీమ. విషం కారణంగా సుశీ రెండువారాల పాటు రియాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది మంగళవారం తుదిశ్వాస విడిచింది.

రెండువారాల కిందట సుశీకి ఏదో కుట్టినట్టు అనిపించింది. భరించలేని నొప్పి పుట్టింది. ఆమె భర్త మాథ్యూ చుట్టూ చూడగా ఒక చీమ కనిపించింది. అతడు దాన్ని బయటపడేశాడు. తర్వాత సుశీ శరీరం అంతకంతకూ ఉబ్బిపోసాగింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అలర్జీ సంబంధమైన అనఫిలాక్టిక్ స్థితిలో ఆమె వెళ్లిపోయింది. దీనివల్ల బ్లడ్ ప్రజర్ భారీగా పడిపోయి, శ్వాస ఆడదు. తక్షణమే చికిత్స అందించకపోతే మరణం సంభవిస్తుంది.

సుశీకి కూడా బీపీ పడిపోయి, శ్వాస కష్టమైంది. చికిత్స ఫలితం ఇవ్వకపోడంతో మరణించింది. చీమ ట్టడం వల్లే ఆమె చనిపోయిందని మాథ్యూ భావిస్తున్నాడు. అయితే చీమ ఇప్పుడు లేకపోవడం, అది విషం చిమ్మిందో లేదో నిర్ధారించే పరీక్షలు చేయకపోవడంతో వైద్యులు కచ్చితమైన ప్రకటన చేయలేదు. సుశీకి ఆస్త్మా ఉందని, అయితే అదుపులోనే ఉందని మాథ్యూ చెబుతున్నాడు. ఇంకో చిత్రమేమంటే.. అదే ఆస్పత్రిలో చనిపోయిన మరో వ్యక్తి కూడా చీమకుట్టే చనిపోయినట్లు అధికారులు చెప్పడం. రెడ్ ఫైర్ వంటి జాతులకు చెందిన చీమలు విషపూరితమని, వాటివల్ల తీవ్రమైన అలర్జీ కలిగి మరణం సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గత ఏడాది జనవరిలో బొలీవియాలోనూ ఒక మహిళ చీమకాట్లతో చనిపోయింది. దొంగతనం నేరంపై ఆమెను చీమలున్న చెట్టుకు కట్టేశారు. పోలీసులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. శ్వాస ఆడక ఆమె చనిపోయింది.