నవ్వులరాజు వేణుమాధవ్.. రూ.600 జీతంతో మొదలై 400 సినిమాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

నవ్వులరాజు వేణుమాధవ్.. రూ.600 జీతంతో మొదలై 400 సినిమాలు..

September 25, 2019

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటుడు వేణుమాధవ్. రూ.600 జీతంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన 400 సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఇప్పుడు ఏడిపిస్తూ వెళ్ళిపోయారు. గత కొద్దికాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దానికితోడు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయి. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.. వేణు మాధవ్ సినీ రంగంలోకి రాకముందు తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లో పనిచేస్తూనే మిమిక్రీ ఆర్టిస్టుగా కొనసాగారు. అప్పుడు ఆయనకు అక్కడ రూ.600 జీతం ఇచ్చేవారు. ఆ తర్వాత ఆయన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దృష్టిలో పడి ‘సంప్రదాయం’ అనే చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయ్యారు. 

Venu Madhav.

అప్పటి నుంచి తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ అగ్ర హీరోలతో కలిసి నటించారు. దశాబ్దం పైన తన హవా కొనసాగించారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. అటు కమెడియన్‌గా కొనసాగుతూనే హీరోగానూ  ‘హంగామా’, ‘భూకైలాష్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు చిత్రాల్లో హీరోగానూ నటించారు. అలాగే ఉదయభానుతో కలిసి వేణు హోస్ట్ చేసిన ‘వన్స్ మోర్ ప్లీజ్’ కామెడీ షో అప్పట్లో బాగా పాపులర్ అయింది. వేణుమాధవ్ చివరిగా ‘రుద్రమదేవి’ సినిమాలో నటించారు. ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వేణుమాధవ్‌కు గత నాలుగేళ్లుగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఆయన రాజకీయాల వైపు మళ్లారు. ఈ క్రమంలో తన సొంతూరు కోదాడ నుంచి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు. ఇలా తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఇకలేరనే నిజం జీర్ణించుకోలేనిదే.