హైదరాబాద్ అంబర్‌పేటలో ఆదివారం జరిగిన కుక్కల దాడిలో బాలుడు మరణించిన విషయం తెలిసిందే. దీంతో జీహెచ్‌ఎంసీపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాప్రతినిధులు అందరూ ఈ సంఘటనను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. ఇదే క్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి దుర్ఘటనను ఖండిస్తూ ఎలా జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. అది కాస్తా వర్మ దృష్టికి వెళ్లడంతో ఆయన తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇంతకీ మేయర్ ఏమన్నారంటే.. ఘటన జరిగిన వెంటనే మేయర్ అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఆకలితోనే వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయని తేల్చి చెప్పారు.
ఓ మహిళ రోజూ కుక్కలకు మాంసాన్ని ఆహారంగా పెట్టేదని, కానీ రెండ్రోజులుగా ఆహారం పెట్టకపోవడంతో బాలుడిపై దాడి చేసి చంపేశాయని స్పష్టం చేశారు. ఒక్కొక్కరు 20 కుక్కలను తీసుకొని స్టెరిలైజ్ చేస్తే నెలకు 600 చొప్పున ఎవరైనా కుక్కలను పెంచుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ వ్యాఖ్యలతో మండిపోయిన రాంగోపాల్ వర్మ మేయర్‌కి చురకంటించారు. ‘కేటీఆర్ సార్.. 5 లక్షల కుక్కలను తెచ్చి డాగ్ హోంలో వేయండి. వాటి మధ్యలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉండేలా చూడండి’ అని ట్వీట్ చేశారు.