చండీ కుమారుడిగా ఖైరతాబాద్  గణేశ్.! - MicTv.in - Telugu News
mictv telugu

చండీ కుమారుడిగా ఖైరతాబాద్  గణేశ్.!

August 25, 2017

ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ చండీ కూమార అనంత మహాగణపతి రూపంలో దర్శనమిచ్చాడు. ఈసారి కూడా 57 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. కుడివైపున సింహవాహనంపై చండీమాత, ఎడమవైపు నెమలి వాహనంపై కుమారస్వామి, కుడి వైపు మరోచోట ఆత్మలింగ సహితుడై, ధ్యానముద్రలో ఉన్న మహాకాళ శివుడు, ఎడమ వైపు మరోచోట మహిషాసుర మర్ధిని దుర్గమ్మవారు కొలువుదీరారు.

శ్రీచండీ కుమార అనంత మహాగణపతి  రూపం పురాణ చరిత్రకు తార్కాణంగా నిలుస్తుంది. 57 అడుగుల మహాగణపతి విగ్రహం వెనుక వైపు మేరు పర్వతంపై కల్పవృక్షం, 14 తలల ఆదిశేషుడి నీడల్లో, డాలు, శంఖు, చక్ర, గదాధారిగా ఎనిమిది చేతులతో, నిండైన విగ్రహం సాక్షాత్కరిస్తోంది.. అలాగే ప్రకృతి రమణీయతకు చిహ్నంగా విగ్రహం పైభాగాన మేరు పర్వతంపై పచ్చని కల్పవృక్షం, ఆక్కడ పక్షులు సేదతీరటం కనిపిస్తోంది. ఈ విగ్రహం రూపకల్పనలో ఓ విశిష్టత ఉందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు గౌరిభట్ల విఠల శర్మ సిద్దాంతి చెబుతున్నారు. లోకంలో అనావృష్టి తొలగిపోయి పంటలు సమృద్ధిగా పండి, సకల శుభాలు కలిగేందుకు చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా  నిర్వహిస్తారు. ప్రస్తుత చండీ కుమార అనంత మహాగణపతిని దర్శించుకుంటే అదే ఫలితం దక్కుతుందని అంటున్నారు. గవర్నర్ నరసింహన్ కుటుంబ సమేతంగా వచ్చి  ఖైరతాబాద్ గణేశునికి  తొలిపూజలు చేశారు.