గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా పోరాడుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన సినిమా ఇండస్ట్రీలో గాయకుడిగా గాత్రాన్ని అందించారు. ఆయన మృతిని సంగీత ప్రియులు, యావత్ తెలుగు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో 16 భాషల్లో 41,230 పాటలు పాడి అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్తానం సంపాదించారు. ఇంజినీరింగ్ కావాలాలని కలలు కన్న బాలు చివరకు గాయకుడిగా మారారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చివరి కోరికను తెలిపారు.
మరణించే వరకు పాడుతుండాలని, చావు దగ్గరకి వచ్చినట్టు తనకు తెలియకుండానే మరణించాలనేది తన చివరి కోరికని బాలు ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. కరోనా బారిన పడే ముందు వరకు బాలు పాటలు పాటుతూనే ఉన్నారు. చివరగా ‘పలాస 1978’ సినిమాలోని ‘ఓ సొగసరి’ అనే పాట పాడారు. ఇదే ఆయన చివరి పాట. ఇక బాలు అంత్యక్రియల విషయానికి వస్తే.. రేపు సాయంత్రం చెన్నై తిరువళ్లూరు జిల్లాలో నిర్వహించనున్నారు. రెడ్‌హిల్స్ సమీపంలోని తామరైపాకంలో బాలు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ ఇంటికి బాలు పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాకంలో బాలు పార్థివదేహాన్ని ఉంచుతారు.