Veteran Telugu Actor Chalapathi Rao Passes Away at 78
mictv telugu

టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం.. చలపతిరావు హఠాన్మరణం

December 25, 2022

Veteran Telugu Actor Chalapathi Rao Passes Away at 78

 

టాలీవుడ్‌లో వరుస విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు చలపతిరావు(78) ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. 1,200కు పైగా సినిమాలలో నటించిన చలపతిరావు.. చాలా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేశారు.

చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. 1944 మే 8న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని బల్లిపర్రులో గ్రామంలో మణియ్య, వియ్యమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, స్నేహితులతో కలిసి వాటిని ప్రదర్శించేవారు. దానివల్ల చదువు సరిగా సాగలేదు. బాగా ఒడ్డు, పొడుగు ఉండటం వల్ల నాటకాల్లో కథానాయకుడిగా నటించేవారు. 1966లో ‘గూడచారి 116’ సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. చలపతిరావు మృతిపై తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

రెండు రోజుల క్రితమే సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు.