Veteran Telugu actor Krishnam Raju passes away at 83; film industry mourns Rebel star's demise
mictv telugu

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

September 11, 2022


రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణం రాజు కన్నుమూశారు. తీవ్రవిషాదంలో ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబసభ్యులు. కృష్ణం రాజు మృతి పట్ల ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

ముఖ్యంగా తన కెరీర్ తొలి రోజుల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణంరాజు మరణ వార్త విని.. తన సంతాపాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎమోషనల్ గా స్పందించారు. ‘శ్రీకృష్ణంరాజు ఇక లేరు అనే వార్త విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి మనవూరి పాండవులు దగ్గరనుంచి నేటి వరకూ నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్ కు నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయనలేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడిలాంటి ప్రభాస్ కు నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘మనవూరి పాండవులు, ప్రేమతరంగాలు , పులి బెబ్బులి’ లాంటి చిత్రాల్లో కృష్ణంరాజు తో కలిసి నటించారు చిరంజీవి.

కృష్ణంరాజు మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. ‘‘కృష్ణంరాజు గొప్ప నటుడు, మానవతావాది, అజాతశత్రువు. సాంఘిక, పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో సాటిలేని మేటి. నటుడిగా, నిర్మాతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటుబడ్డారు. అయిదున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులపై ఆయన చెరగని ముద్రవేశారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభ్యున్నతికి కృషిచేశారు. సినీనటుడిగా, నిర్మాతగా, ప్రజా ప్రతినిధిగా ఆయన సేవలు నిరుపమానం. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’’అని తెలిపారు.
కృష్ణంరాజు మృతిపట్ల సీనియర్‌ నటుడు కృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు.

సీనియర్‌ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ‘కృష్ణంరాజుగారి మృతి నిజంగా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ట్వీట్‌ చేశారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తమ కుటుంబంతో కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయన్నారు. తాము కూడా మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. కృష్ణంరాజు కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.