తమిళనాడులోని ఓ వ్యక్తి రూ. 10 నాణేలతో రూ. 6 లక్షల విలువైన కారు కొనుగోలు చేశాడు. మొదట ఆశ్చర్యపోయిన కారు షోరూం నిర్వాహకులు చివరికి బ్యాంకు వారిని సంప్రదించి కారు తాళాలను వ్యక్తికి అందజేశారు. అయితే నాణేలతోటే కారు ఎందుకు కొనాలనిపించిందని ఆ వ్యక్తిని అడుగగా, షాకింగ్ విషయం చెప్పాడు. పూర్తి వివరాలు.. ధర్మపురి జిల్లాలోని హరూర్ ప్రాంతానికి చెందిన వెట్రివేల్ (25) ఓ నర్సరీ పాఠశాలను నిర్వహిస్తున్నాడు.
అయితే ఓ రోజు తన స్కూలు ముందు చిన్న పిల్లలు రూ. 10 నాణేలతో ఆడుకోవడం గమనించి డబ్బులతో ఎందుకు అలా ఆడుతున్నారని ప్రశ్నించగా, అవి చెల్లవు కాబట్టి వాటితో ఆడుకుంటున్నామని వారు బదులిచ్చారు. దీంతో వెట్రివేల్ బ్యాంకు వారిని సంప్రదించి ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నారు. రూ. 10 నాణేలు చెల్లవని ఆర్బీఐ సహా ఏ బ్యాంకు గానీ, ప్రభుత్వం కానీ ప్రకటించలేదన్న విషయాన్ని గ్రహించాడు. ప్రజలు కేవలం అపోహతోటే వాటిని స్వీకరించడం లేదన్న నిర్ణయానికి వచ్చి వారిలో అవగాహన కలిగించాలని నిశ్చయించాడు. దాంతో తాను ఎప్పటినుంచో కొనాలనుకున్న కారును రూ. 10 నాణేలతో కొనాలని డిసైడ్ అయ్యాడు. తన వద్ద ఉన్న నోట్లను పలు బ్యాంకులలో మార్చి బదులుగా వారి వద్ద ఉన్న నాణేలను తీసుకునేవాడు. ఇలా కారు కొనేంత డబ్బు రూ. 6 లక్షలు జమ కాగానే వాటిని బస్తాల్లో నింపి ఆటోలో వేసుకొని కారు షోరూంకి బయల్దేరాడు. మొదట ఆశ్చర్యపోయిన షోరూం సిబ్బంది బ్యాంకు వారి నుంచి సలహా తీసుకొని నాణేలను తీసుకున్నారు. మొత్తం లెక్కపెట్టడానికి ఆ సిబ్బందికి 4 గంటల సమయం పట్టింది. అనంతరం కారు తాళాలు వెట్రివేల్‌కు ఇవ్వగా, కారు తీసుకొని వెట్రివేల్ ఇంటికి వెళ్లిపోయాడు. ప్రజల్లో అవగాహన కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని స్థానికులు వెట్రివేల్‌ను అభినందించారు.