వీహెచ్ ఇంటిపై దాడి.. నిందితుడు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

వీహెచ్ ఇంటిపై దాడి.. నిందితుడు అరెస్ట్

April 14, 2022

 4

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు కారుపై ఓ వ్యక్తి రాళ్లతో దాడి చేయడంతో కారును అద్దాలు ధ్వంసమైన  సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అనుమానాలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో తన కారుపై జరిగిన రాళ్లదాడిపై వీహెచ్ స్పందిస్తూ.. ”దాడికి పాల్పడినవారిని గుర్తించాల్సింది పోలీసులే. పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన నాకే రక్షణ లేకుండా పోయింది. గతంలో నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. డీజీపీకి ఫిర్యాదు చేసినా. కానీ, ఇప్పటి దాకా చర్యలు తీసుకోలేదు. నా కారును ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోండి” అని ఆయన అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వీహెచ్ కారుపై రాళ్ల దాడి చేసిన వ్యక్తి కోసం దర్యాప్తును మొదలుపెట్టారు.

మాజీ ఎంపీ వి. హనుమంతరావు కారుపై జ‌రిగిన దాడి.. తెలంగాణ‌ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్ప‌డ్డిన వ్య‌క్తి ఎవ‌ర‌న్న కోణంలో విచార‌ణ మొద‌లుపెట్టారు. దాడికి సంబంధించి రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. ఎట్ట‌కేల‌కు నిందితుడు ఎవ‌ర‌న్న విష‌యాన్ని నిగ్గు తేల్చారు.

అంతేకాకుండా అత‌డిని అదుపులోకి కూడా తీసుకున్నారు. వీహెచ్ ఇంటిపై దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తి.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన సిద్ధార్థ్‌గా పోలీసులు గుర్తించారు. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అత‌డి అరెస్ట్‌ను పోలీసులు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. యూపీకి చెందిన వ్య‌క్తి వీహెచ్ కారుపై దాడి చేయ‌డానికి గ‌ల కార‌ణ‌ం ఏంటీ అని ప్రస్తుతం సంచలనంగా మారింది. మరికొద్ది గంటల్లో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.