రోజువారీ ఉపయోగించగా మిగిలిన డేటా వృథా అయిపోతుందని బాధపడేవారు ఎందరో. దానిని వాడెయ్యాలని కొందరు ఇంటర్నెట్లో ఏదో ఒకటి చూస్తుంటారు. అయితే కొందరు మాత్రం పనుల్లో బిజీగా ఉండటం వల్ల, కార్యాలయాల్లో వైఫై సదుపాయం కారణంగా తమ ఫోన్లోని డేటాను వాడుకోకుండా వదిలేస్తుంటారు. అలా వదిలేస్తే సదరు కంపెనీ సేవ్ అవుతుంటుంది. వినియోగదారుడు మాత్రం డేటా వాడినా వాడకున్నా తర్వాత అంతే డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. వాడని డేటాను ఏ టెలికాం సర్వీసు తిరిగి వెనక్కు ఇవ్వదు. ఈ నేపథ్యంలో రోజూవారి ఉపయోగించగా మిగిలిన డేటాను వారాంతంలో ఉపయోగించుకునేలా ఓ అద్భుత ఆఫర్‌ను వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రకటించింది. ‘డేటా రోల్ ఓవర్’ పేరుతో ఈ ఆఫర్‌ను తమ వినియోగదారులకు అందిస్తోంది. రూ.249, ఆపైన రీచార్జ్ చేయించుకునే ఖాతాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది.
రోజూవారీ డేటా ప్రయోజనాలతో అన్లిమిటెడ్ ప్యాక్స్‌ను ఉపయోగిస్తున్న ప్రీపెయిడ్ ఖాతాదారులకు తక్షణం ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టంచేసింది. వొడాఫోన్ ఐడియాలో చేరే కొత్త ఖాతాదారులకు కూడా ఇది వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. రోజువారీ డేటాలో ఉపయోగించగా మిగిలిపోయిన డేటా ఇక వృథా అవుతుందని భయపడాల్సిన అవసరం లేదని, వారాంతంలో అది తిరిగి వచ్చి చేరుతుందని వొడాఫోన్ ఐడియా మార్కెటింగ్ డైరెక్టర్ అవనీష్ ఖోస్లా చెప్పారు. వారాంతాల్లో ఎంటర్టైన్మెంట్, వీడియో కాల్స్ చేసుకునేందుకు ఈ డేటాను వాడుకోవచ్చని వివరించారు. కాగా, వొడాఫోన్ ఐడియా వరుసగా తొమ్మిదో నెలలోనూ ఖాతాదారులను కోల్పోయింది. జులైలో ఏకంగా 3.7 మిలియన్ల మంది టెల్కోను విడిచిపెట్టారు. ఈ క్రమంలో ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు వరుసగా 3.2, 3.5 మిలియన్ల వినియోగదారులను పొందాయి.