సింగరేణిలోనీ ఎస్ అండ్ పీసీ విభాగంలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ను కొందరు వ్యక్తులు చితకబాదడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కోల మహేశ్ అనే వ్యక్తి తమ వద్ద లక్షల రూపాయలు తీసుకున్నాడంటూ బాధితులు రెచ్చిపోయారు. అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణిలోని ఎస్ అండ్ పీసీ విభాగంలో కోల మహేశ్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అక్కడ తనకున్న సర్కిల్ తో.. మందమర్రి, జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ మండలాలకు చెందిన పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. వారంతా అతడి మాటలు నమ్మి సుమారు రూ. 30 లక్షల ముట్టజెప్పారు.
రోజులు గడిచే కొద్ది వారికి ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు… గత సంవత్సరం ఆగస్టు 19న మందమర్రి ఎస్ అండ్ పీసీ కార్యాలయంలో సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో బాధితులు మిన్నకుండిపోయారు. 4 నెలలు గడుస్తున్న డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితుడు పనిచేసే కార్యాలయానికి వెళ్లి దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్నారు.