ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఆ పని చేయకుండా అందుబాటులో లేకుంటే వారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలు చూశాం. అంతేకాక, ప్లెక్సీలు కూడా కట్టి నిరసన వ్యక్తం చేయడం గురించి విన్నాం. కానీ, ఓ చిట్టీల వ్యాపారి కోసం ప్రజలు ఏకంగా కూడలిలో ప్లెక్సీలు ఏర్పాటు చేసి రూ. 3 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. తమను సంప్రదించేందుకు వ్యాపారి ఫోటో కింద ఫోన్ నెంబర్లను కూడా ముద్రించారు. మాయమాటలు చెప్పి ప్రజల నుంచి అందినకాడికి డబ్బులు దోచుకున్న మోసగాడి కోసం బాధితులు ఈ పని చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వెలసిన ఈ ప్లెక్సీల ఘటన వెనుక బాధితుల ఆవేదన ఉంది. వివరాల్లోకెళితే.. గోవిందుపల్లి చౌరస్తాకు చెందిన గాండ్ల వెంకన్న అనే వ్యక్తి కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేసి బాగానే నడిపాడు. అందరితో నమ్మకంగా ఉంటూ స్థానికుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి ఉడాయించడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు కొన్ని రోజులు వెతికి తర్వాత ఇలా ప్లెక్సీల బాట పట్టారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండడంతో వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా కనపడితే దయచేసి తమకు సమాచారం అందించాలని, మూడు లక్షల నగదు బహుమతి కూడా ఇస్తామని చెప్తున్నారు.