ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సైన్యంతో బాంబు దాడులు చేస్తుండగా, మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన చేస్తున్నారు. జెలెన్ స్కీ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అమెరికా, ఈయూ అనుకూల వైఖరి తీసుకోగా.. ఫలితంగా పరిస్థితులు యుద్ధానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూలగొట్టి, తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచేందుకు పుతిన్ వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం 2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన విక్టర్ యానుకోవిచ్ ను రంగంలోకి దింపుతున్నారు. రష్యా అనుకూలుడైన విక్టర్ 2014లో ప్రజా తిరుగుబాటుతో పదవీచ్యుతుడై అప్పటి నుంచి రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు అతడిని వెలుగులోకి తీసుకు వచ్చి యూరప్, అమెరికాలకు గట్టి సందేశం పంపాలనే ఉద్దేశంలో పుతిన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.