Video: 14 Cars Swept Away After Surge In Khargone River Level
mictv telugu

హఠాత్తుగా పెరిగిన వరద.. చూస్తుండగానే 14 కార్లు గల్లంతు

August 8, 2022

అప్పటి వరకు చుక్క నీరు లేని చోట.. ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఆ ప్రవాహానికి దాదాపు 14 కార్లు కొట్టుకుపోయాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందర్నీ షాక్‌కు గురిచేసింది. ఖర్గోన్ జిల్లాలో ఉన్న కొండగుట్టలు పర్యాటక ప్రాంతం. దాంతో ఇక్కడికి చాలా మంది పిక్నిక్‌గా వస్తుంటారు. ఆదివారం కూడా సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. కార్లలో వచ్చి.. అక్కడ సరదాగా సేదతీరారు. ఎండిపోయిన నదీ మార్గంలో కార్లను నిలిపి.. ప్రకృతిని ఆస్వాధిస్తున్నారు.

 

అయితే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు.. ఉన్నట్లుండి వరద ప్రవాహం దూసుకొచ్చింది. వెంటనే అలర్ట్ అయిన జనాలు.. కార్లను అక్కడే వదిలేసి.. కొండ గుట్టలపైకి ఎక్కారు. అయితే, వరద ప్రవాహానికి దాదాపు 14 కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది గమనించిన స్థానికులు ట్రాక్టర్ల సాయంతో 10 కార్లను బయటకు తీయగలిగారు. మిగతావి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద ప్రవాహ ఉధృతికి ఒక్కొక్క కారు నీటిలో తేలుతూ కొట్టుకుపోయాయి. అయితే, నీటి నుంచి బయటకు తీసిన కార్లు సైతం పూర్తిగా పాడైపోయాయి. అయితే, ఆ ప్రవాహాన్ని ముందే గుర్తించిన పర్యాటకులు.. బతుకు జీవుడా అంటూ ఎత్తైన ప్రాంతాలకు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. లేదంటే భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేది. ఈ నీటి ప్రవాహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.