తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందుర్తి గ్రామంలో ఘోరం జరిగిపోయింది. అభం. శుభం తెలియని ఓ చిన్నారి యువకుల మత్తుకు బలైపోయింది. బిడ్డ మరణవార్తతో తల్లిదండ్రుల శోకం ఆకాశాన్ని అంటింది. ఎందుకంటే ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులకు పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. ఆ బిడ్డకోసం మొక్కని దేవుడు, చేయని పూజలు లేవు. ఆ చిన్నారే ఆ తల్లిదండ్రులకు ప్రపంచం. ఇటువంటి సమయంలో తమ బిడ్డ రోడ్డు ప్రమాదం జరిగి, మృతి చెందిందని తెలియగానే ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కూప్పకులిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”లోకిని జంపయ్య, రాజేశ్వరీ దంపతులది సొంతూరు ఇందుర్తి. వీరికి కూతురు శివాని(10) ఉంది. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. బతుకుదెరువు కోసం తిమ్మాపూర్‌కు వచ్చారు. స్టేజీవద్ద అద్దెకు ఉంటున్నారు. జంపయ్య కూలీపని, రాజేశ్వరి సమీపంలోని ఓ మొబైల్ క్యాంటీన్లో పనిచేస్తుంటుంది. శివాని శుక్రవారం మధ్యాహ్నం తల్లి వద్దకు రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తుండగా, అలుగునూరు నుంచి తిమ్మాపూర్‌కు వస్తున్న అదే గ్రామానికి చెందిన అట్ల సంతోశ్, శ్రీధర్, డేవిడ్ మద్యం మత్తులో కారుతో శివానిని వెనకనుంచి వేగంగా ఢీకొట్టడంతో శివాని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మృతి చెందింది. కారు వేగానికి విద్యుత్ స్తంభం విరిగిపోయింది” అని వివరాలను వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఆ వీడియోలో శివాని(10) వర్షం పడుతుందని గొడుగుతో రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే కారు వెనకనుంచి వచ్చి ఢీకొట్టింది. దాంతో శివాని ఎగిరికింద పడింది. ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ ‘అయ్యో భగవంతుడా ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి రావొద్దంటూ’ ప్రార్థిస్తున్నారు.
https://youtube.com/shorts/ch4Q3e7qZt4?feature=share