Video: Chirag Paswan Questions Liquor Ban In Bihar, Shares Video
mictv telugu

నిషేధ రాష్ట్రం.. మద్యాన్ని పబ్లిగ్గా, సీక్రెట్‌గా ఎలా అమ్ముతున్నాడో చూడండి..

September 13, 2022

బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరచూ ఏదో ఒక విమర్శలకు గురవుతున్నారు. ఆ రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవల నితీష్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ విషయంలో సీఎంతో సహ రాష్ట్ర పోలీసులు కూడా విఫలమయ్యారని చెబుతూ… రకరకాల సమస్యలపై ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా రాష్ట్రంలో మద్యనిషేధం అమల్లో వైఫల్యాలపై కౌంటర్ వేస్తూ ఓ ట్వీట్ చేశాడు పాశ్వాన్. ఓ వ్యక్తి బల్లియా నుండి దరౌలీకి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానని పేర్కొంటూ బైక్ నడుపుతున్న వీడియోను ట్విటర్ లో షేర్ చేశాడు.

 

 

“సీఎం నితీష్ కుమార్.. మీ దృష్టి ప్రధానమంత్రి కుర్చీపై ఉంటే ఫర్వాలేదు, కానీ మీరు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే, బీహార్‌లో ఇదంతా జరిగేది కాదు. రాష్ట్రంలో మద్యం బహిరంగంగా ఎలా సరఫరా చేయబడుతుందో చూడండి. మీ పోలీసులు మౌనంగా, ఇదంతా ప్రేక్షకుల్లాగా చోద్యం చూస్తున్నారు” అంటూ ఆ వీడియోను షేర్ చేశాడు. కాగా బీహార్‌లో, ఏప్రిల్ 2016 నుండి మద్యం నిషేధం అమల్లో ఉంది. అతిక్రమించిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష. అయితే ఈ నిషేధాన్ని అతిక్రమించిన వారు పెద్ద సంఖ్యలో ఉండడం, జైళ్లలో శిక్ష అనుభవించిన వ్యక్తులు ప్రముఖులు కావడం, పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా ఉండటంతో, నితీష్ కుమార్ ప్రభుత్వం చివరికి ఆర్టికల్ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది.

మొదటిసారి నేరం చేసిన వారిని డ్యూటీలో ఉన్న మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో రూ. 2,000 నుండి 5,000 వరకు జరిమానా చెల్లించాలని చెప్పింది. ఆ తర్వాత వారిని వదిలిపెట్టాలని తెలిపింది. అయితే, బీహార్‌లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం నితీశ్‌పై బీజేపీ, ఇతర ప్రతిపక్షాల నుంచి ఎడతెగని దాడి జరుగుతోంది.