Video: I am the reason for Pakistan's defeat..Shadab Khan
mictv telugu

వీడియో: పాకిస్తాన్ ఓటమికి నేనే కారణం..షాదాబ్ ఖాన్

September 12, 2022

”ఆసియాకప్‌ ఫైనల్‌లో గతరాత్రి పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోవటానికి నేనే కారణం. క్యాచులే మ్యాచ్‌ను గెలిపిస్తాయి. క్షమించండి. ఈ ఓటమికి బాధ్యత నాదే” అంటూ పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ ప్రకటించాడు. ఈ ప్రకటన వెనక ఉన్న కారణం ఏంటో తెలియాలి అంటే..ఒకసారి మ్యాచ్‌లో జరిగిన ఆ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే..

గతరాత్రి దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్‌ను వీక్షించిన వారందరు మొదటగా పాకిస్తాన్ జట్టే గెలుస్తుందని అనుకున్నారు. అందుకో కారణం ఉంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను.. పాకిస్తాన్ వణికించింది. 58 పరుగులకే ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. దాంతో పాకిస్తాన్ అభిమానులు తెగ ఆనందపడ్డారు.

 

అప్పటికే లాంగాన్‌లో ఒకసారి క్యాచ్‌ను జారవిడిచిన షాదాబ్..19 ఓవర్‌లో మరోమారు క్యాచ్ నేలపాలు కావడానికి కారణమయ్యాడు. భానుక మిడ్ వికెట్ మీదుగా కొట్టిన బంతి గాల్లోకి లేచింది. ‘బౌండరీ లైన్ వద్దనున్న అసిఫ్ అలీ బంతిని పట్టుకుంటుండగా, అదే సమయంలో అదే క్యాచ్ పట్టేందుకు వచ్చిన షాదాబ్ బలంగా అతడిని ఢీకొట్టాడు. దీంతో క్యాచ్ నేలపాలైంది.’ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షాదాబ్ మైదానాన్ని వీడాడు. నిజానికి పాక్ ఓటమికి ఈ రెండు క్యాచ్‌లో కారణం.

కాగా, ఆసియాకప్‌లో అద్భుతంగా రాణించిన నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్‌లపైనా షాదాబ్ ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్‌లో పరుగుల వరద పారించిన మహ్మద్ రిజ్వాన్‌ను కొనియాడాడు. విజయం సాధించిన శ్రీలంకకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా కుదురుకున్న శ్రీలంక.. పాక్ బౌలర్లను చీల్చిచెండాడింది. ముఖ్యంగా భానుక రాజపక్స వీరోచిత ఇన్నింగ్స్‌తో లంకను ఆదుకున్నాడు. దీనికి తోడు రెండు లైఫ్‌లు దొరకడంతో చెలరేగిపోయాడు. అజేయంగా 71 పరుగులు చేసి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్రీజులోకి వచ్చిన ప్రమోద్ మధుషన్, వనిందు హసరంగ నిప్పులు చెరిగే బంతులకు తట్టుకోలేని పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా శ్రీలంక ఖాతాలో ఆరో ఆసియాకప్ చేరింది.