అడవికి రారాజైన మృగరాజును ఓ గ్రామసింహం గజగజ వణికించింది. ఆ సింహాన్ని వెంటాడి చుక్కలు చూపించింది. సింహాన్ని వెంటాడి ఏకంగా తరిమికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన గుజరాత్ రాజ్కోట్ జిల్లాలోని లోధికా తాలుకాలోని మాగాణి గ్రామ పరిసరాల్లో వెలుగు చూసింది.
మాగాణి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలను జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఓ కుక్కను కాపలాగా ఉంచారు. అయితే రెండు రోజుల క్రితం ఆ పంట పొలాల వైపు ఓ సింహాం వచ్చింది. పొలాల నుంచి గ్రామం వైపు వస్తున్న సింహాన్ని చూసిన కుక్క ఏమాత్రం బెదరకుండా దాన్ని వెంటాడి గ్రామ సరిహద్దుల వరకు తరిమికొట్టింది. ఈ ఘటనను చూసి రైతులు ఆశ్చర్యపోయారు. రైతులు అందించిన సమాచారంతో సింహాన్ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. సింహాన్ని కుక్క తరిమికొడుతున్న ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.