Video: Rushing 'Surya 42'..released in 10 languages
mictv telugu

వీడియో: దూసుకొస్తున్న ‘సూర్య 42’..10 భాషల్లో విడుదల

September 10, 2022

దక్షిణాది సినీ ప్రియులకు సుపరిచితుడు, తమిళ స్టార్ హీరో సూర్య తన 42వ చిత్రానికి సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. వీడియోను వీక్షిస్తున్న సూర్య అభిమానులు..’చిన్న మోషన్ పోస్టరే ఇలా ఉంటే ఇక ట్రైలర్, సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి’ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

సూర్య 42వ చిత్రాన్ని..యువీ క్రియేషన్స్ అధినేత వంశీకృష్ణ, ప్రమోద్ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా కలిసి నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని కోలీవుడకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే హీరో సూర్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘సూరం పోట్రు’ (ఆకాశమే హద్దురా) చిత్రానికి ఉత్తమ జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాదు, అస్కార్ అవార్డుల కమిటీలో సభ్యుడిగా సౌత్ ఇండియా నుంచి అరుదైన గౌరవాన్ని పొందాడు. ఈ క్రమంలో మరో భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక, సూర్య 42 డైరెక్టర్ చిరుతై శివ విషయానికొస్తే..ఈయన ఇంతకుముందు అజిత్ హీరోగా ‘వీరం’, ‘విశ్వాసం’, ‘వివేకం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అంతేకాదు, రజనీకాంత్ కథానాయకుడిగా ‘అన్నాలె’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి..వెట్రి పళణిస్వామి ఛాయాగ్రహణం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతానికి సూర్య 42 పేరుతో నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు శుక్రవారం విడుదల చేశాయి.

అందులో హీరో సూర్య..పోరాట వీరుడుగా కనిపిస్తుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు వెల్లడించారు. అతి త్వరలోనే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది? ట్రైలర్, పాటలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలియజేశారు.