కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టిందని ప్రజలు పండగ షాపింగ్‌కు వెళ్తున్నారు. మరోవైపు ఇన్ని రోజులు షాపులు మూసుకుని కూర్చున్నామని కొన్ని షాపింగ్ మాల్స్ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో ఆ షాపుల్లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని షాపులను సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే చెన్నైలో పది రూపాయలకు బిర్యానీ అని ప్రకటించడంతో జనాలు ఎగబడ్డారు. దీంతో సదరు బిర్యానీ హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. కరోనా నిబంధనలను తోసిపుచ్చి చెన్నైలోని ప్రసిద్ధ కుమరన్ సిల్క్స్ ఆఫర్లు ప్రకటించగా, జనాలు మాల్లో కిక్కిరిసిపోయారు. దీంతో మంగళవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) సదరు దుకాణాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Kumaran Silks in Chennai sealed after video of crowding and lack of physical distancing emerges. @chennaicorp @thenewsminute pic.twitter.com/qIM9HyUxSv
— priyankathirumurthy (@priyankathiru) October 20, 2020
షోరూమ్ లోపల, వెలుపల ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా, ఫేస్ మాస్కులు ధరించకుండా వందలాది మంది గుమిగూడటంతో దానికి సీల్ వేశామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వెల్లడించింది. మరోపక్క కరోనా భద్రతా చర్యలను ప్రతీఒక్కరు ఖచ్చితంగా పాటించాలని జీసీసీ ఒక ట్వీట్ చేసింది. కరోనా అప్పుడే తగ్గిపోయిందని భావించవద్దని.. నిబంధనలు ఉల్లంఘించడం చాలా ప్రమాదకరం, బాధాకరమని జీసీసీ కమిషనర్ జీ ప్రకాష్ అన్నారు. ‘ఒకేసారి 500 లేదా వెయ్యి మంది కస్టమర్లను అనుమతించం. వీరిని దుకాణాదారులే నియంత్రించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. కాగా, ఇలాంటి ఉల్లంఘనలు ప్రతి దుకాణంలోనూ జరుగుతున్నాయని.. ఈ ఒక్క దుకాణాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇది పండుగ కాలం కనుక షాపింగ్ చేయాలనుకుంటున్నారని గీతా పద్మనాభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.