ఈ వీడియో చూసినా పొగ తాగుతారా? మీ ఖర్మ! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వీడియో చూసినా పొగ తాగుతారా? మీ ఖర్మ!

November 20, 2019

‘పొగ తాగొద్దురా కొడుకా.. కొంప కొల్లేరు చేయొద్దురా మొగుడా’ అని ఎందరో మహిళలు తమ మొగుళ్లను కాళ్లావేళ్లా పడి వేడుకుంటుంటారు. కానీ పొగరాయుళ్లు వినరు. ‘పొగ తాగడం హానికరం.. క్యాన్సర్‌కు కారకం’ అంటూ ప్రభుత్వం సిగరెట్ డబ్బాల మీద భయంకరమైన ఫోటోలతో హెచ్చరించినా కూడా పట్టదు. మైండ్ రిలాక్సేషన్, టెన్షన్ ఫ్రీ, రీచార్జ్ అవడానికి ఇలా రకరకాల సాకులు చెప్తూ పొగ తాగడానికి బానిసలు అవుతున్నారు. అలాంటి మొండి ఘటాలకు ఈ వీడియో చూపిస్తే కొంతలో కొంతైనా మార్పు రావొచ్చేమో. చైన్ స్మోకర్లుగా మారినవారి ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనాలో 52 ఏళ్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే తన మరణం తర్వాత తన శరీర అవయవాలను దానం చేస్తున్నట్లు బతికుండగానే రాసిచ్చాడు. అతను చనిపోగానే అతను చెప్పినట్లుగానే అవయవాలు సేకరించేందుకు వైద్యులు అతని శరీరంను కోశారు. ఒక్కో అవయవం శరీరం నుంచి వేరు చేస్తూ వచ్చారు. అవయవాలు అన్నీ తీసి చివరగా ఊపిరితిత్తులను తీయగానే వారు షాక్ అయ్యారు. అవి మసిపూసినట్లుగా నల్లగా తయారయ్యాయి. చనిపోయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉందని గ్రహించారు. 

అతని కుటుంబ సభ్యులను అడగగా.. అతను గత 30 ఏళ్ల నుంచి పొగ తాగుతున్నాడని చెప్పారు. రోజుకు ఒక సిగరెట్ ప్యాకెట్ తాగేవాడని తెలిపారు. అందువల్లే అతని ఊపిరితిత్తులు అలా నల్లగా పొగచూరిపోయాయని సర్జన్లు గ్రహించారు. ప్రస్తుతం ఈ వీడియో చైనా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు భయంతో ఎమోజీలు పెడుతున్నారు. బెస్ట్ యాంటీ స్మోకింగ్ యాడ్ అని అంటున్నారు. దీనిని చూసైనా పొగ రాయుళ్లు మారాలని చెబుతున్నారు.