మహాతల్లి.. చోరీకి వెళ్లి బిడ్డను మరిచింది..
దొంగతనానికి వెళ్లినప్పుడు ఎంతో అలర్ట్‌గా వుండాలన్న విషయాన్ని ఆ మహాతల్లి మరిచిపోయినట్టుంది. వెళ్లిందే దొంగతనానికి.. కూడా తన బిడ్డను తీసుకెళ్లింది. వెళ్లింది.. బిడ్డకు అవసరమయ్యే స్ట్రోలర్‌ను (పిల్లలు కూర్చునే చక్రాల కుర్చీ) లూటీ చేసింది.. కానీ బిడ్డను మరిచిపోయి పారిపోయింది. తర్వాత బిడ్డను అక్కడే మర్చిపోయానని వెనక్కు వచ్చి పోలీసులకు చిక్కింది. ఈ విచిత్ర ఘటన న్యూజెర్సీలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ షాప్‌కు చోరీకి వెళ్లింది. అక్కడికి తన బిడ్డను కూడా ఎత్తుకెళ్లింది. బిడ్డను అక్కడ కూర్చుండబెట్టింది. తన స్నేహితులు షాపు వారితో మాటలు కలిపి దృష్టి మరల్చారు.
అదే అదనుగా భావించిన ఆమె వాళ్ల కళ్లుగప్పి స్ట్రోలర్‌ను తీసుకుని అక్కడినుంచి పరారైంది. అయితే, ఆమె ఆ కంగారులో బిడ్డను అక్కడే మరిచిపోయి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాసేపటికి తన ఇద్దరు స్నేహితులు కూడా అక్కడినుంచి వచ్చేశారు. ఇంటికెళ్లాక దొంగిలించుకు వచ్చిన స్ట్రోలర్‌లో బిడ్డను కూర్చుండబెట్టాలని చూసింది. అప్పుడే తనకు తెలిసింది ఏంటంటే తన బిడ్డను అక్కడే మరిచిపోయానని. వెంటనే బిడ్డ కోసం మళ్లీ స్టోర్‌కు వెళ్లింది. అప్పటికే చోరీ విషయం గుర్తించిన సిబ్బంది ఆ మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.