Video: Train Passes Over Man At UP Station, Watch His Escape
mictv telugu

రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడినా బతికి బయటపడ్డాడు.. వీడియో

September 6, 2022

రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఈ వ్యక్తిని చూస్తే అతనికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయని అనిపించకమానదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్, ట్రాక్‌ల మధ్య గ్యాప్‌లో పడిన ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ – హౌరా మార్గంలోని ఓ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ నంబర్ – 2పై మంగళవారం (సెప్టెంబర్ 6) ఉదయం 9.45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆగ్రా నుంచి బయల్దేరిన ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.30 గంటలకు ఇటావాలోని భర్తానా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుండగా.. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఓ వ్యక్తి హడావిడిగా ప్లాట్‌ఫారమ్ నెంబర్ -2 వద్ద నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పి రైలు, రైల్వే ట్రాక్‌ల మధ్య పడిపోయాడు. అంతే.. అక్కడ ఏం జరిగిందోనని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై అలర్ట్ చేశారు. అయితే, అప్పటికే రైలు వేగం పుంజుకోవడంతో ఏమీ చేయలేకపోయారు. ఈలోగా రైలు కోచ్‌లన్నీ దాటుకుంటూ వెళ్లిపోయాయి. ఇంతలో బతుకుజీవుడా అంటూ ఆ వ్యక్తి దండం పెడుతూ పైకి లేచొచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.