బూతుల పోలీస్‌ చెంపలు వాయించేసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

బూతుల పోలీస్‌ చెంపలు వాయించేసింది.. 

October 24, 2020

Woman slaps, beat traffic police constable at Kalbadevi in mumbai.jp

విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు చెంపలు వాయించిందో మహిళ. నడిరోడ్డు మీద ఆమె అతని కాలర్ పట్టుకుని ముఖంపై చరిచింది. దీంతో కాసేపటివరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తనను బూతులు తిట్టడం వల్లే అతని దుమ్ము దులిపానని సదరు యువతి ఆరోపిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ముంబైలోని మసీద్‌ బండార్ ప్రాంతానికి చెందిన సంగ్రికా తివారీ(29), భేండీ బజార్‌కు చెందిన మొహ్‌సిన్‌ షేక్‌(32)లు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఓ పని మీద స్కూటీపై బయటకు వెళ్లారు. ఆ సమయంలో స్కూటీ నడుపుతున్న మొహ్‌సిన్‌ హెల్మెట్‌ ధరించలేదు. వారి స్కూటీ కాల్దాదేవీ ఏరియాలోని సూర్తీ హోటల్‌ వద్దకు రాగానే ట్రాఫిక్‌ పోలీస్‌ ఏక్తా పర్తే వారి వాహనాన్ని ఆపేశారు. హెల్మెట్ ధరించనందుకు ఫైన్‌ విధించారు. దీంతో ఆ ఇద్దరు మహిళలకు, అధికారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

సదరు ట్రాఫిక్‌ పోలీసు అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహించిన సంగ్రికా తివారీ యూనిఫాంలో ఉన్న అతని చొక్కా పట్టుకుని దాడికి పాల్పడింది. బూతులు తిడతావా అంటూ అతని ముఖం మీద ఎడాపెడా వాయించింది. దీనినంతా మొహిసీన్ షేక్ వీడియో తీశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ శాంతించని సంగ్రికా ఓ మహిళా పోలీసుపై కూడా చెయ్యి చేసుకోవటానికి ప్రయత్నించింది. దీంతో ఇద్దరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై దాడి, విధులకు తీవ్ర ఆటంకం కలిగించారని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.