జనగణమనకు నిలబడాల్సిన పనిలేదు.. విద్యా బాలన్
జాతీయవాదం సినిమాల్లో ఉండాలి గానీ, సినిమా హాళ్లలో ఉండాల్సిన అవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఏకీకరణ, సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనపై ఆమె స్పందిస్తూ.. ‘సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని వేసే సమయంలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదు. జాతీయవాదం సినిమాల్లో వుండాలి తప్పితే సినిమా హాళ్లల్లో వుండాల్సిన అవసరం లేదు. భారతీయులు గర్వించే, సంతోషించదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. విదేశాలు వెళ్లినప్పుడే మనదేశం ఎంత గొప్పదో మనకు బోధపడుతుంది. ఇక్కడి సహజ సిద్ధమైన అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతీ సంప్రదాయాలు చాలానే ఉన్నాయి. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది’ అని విద్యాబాలన్ వ్యాఖ్యానించారు.
కాగా, సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. సినిమా ప్రదర్శనకు ముందు హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు ప్రేక్షకులు అందరూ తప్పకుండా లేచి నిల్చోవాలన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే. తొలుత దీనిని చాలామంది విమర్శించారు. కొందరు సమర్థించారు. ఈ నేపథ్యంలో నిల్చోని వారిపై కేసులు నమోదైన ఘటనలు కూడా ఉన్నాయి.