సినిమా థియేటర్లలో జనగణమన రికార్డు వేయాలని, ఆ సమయంలోనే అందరూ లేచి నుల్చోవాలని వాదిస్తున్న వారికి బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఘటుగా సమాధానమిచ్చింది. ‘దేశభక్తిని బలవంతంగా రుద్దులేరు… సినిమా వేసేటప్పుడు తప్పనిసరిగా జాతీయ గీతం ఆలపించాల్సిన అవసరం లేదు.
అదేమీ చిన్నపిల్లల బడి కాదు కదా’ అని విలేకర్లతో చెప్పింది. అయితే తాను దేశాన్ని ప్రేమిస్తానని స్పష్టం చేసింది. ‘దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాను.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా జాతీయ గీతం వినిపిస్తే తప్పకుండా లేచి నిలబడతాను. కానీ థియేటర్లలో ఆ రికార్డు వేయాలల్సిన అవసరం లేదు’ అని విద్యాబాలన్ పేర్కొంది. ఆమె ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు. హాళ్లలో జనగణమన సమయంలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పడం తెలిసిందే. అయితే లేచి నిలబడాలని, అది దేశభక్తికి చిహ్నమని పలువురు సెలబ్రిటీలు చెబుతున్నారు.