vijay devarakonda craze in North, Liger movie promotions in Pune
mictv telugu

క్రేజీ ఫ్యాన్స్.. స్టేజి వదిలి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ, అనన్య

August 12, 2022

సౌత్ ఇండస్ట్రీలోనే కాక.. బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. అసలు ఇప్పటివరకూ నార్త్‌లో ఏ ఒక్క సినిమా చేయకపోయినా..అతని కోసం అక్కడి అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ రేంజ్‌లో విజయ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో అభిమానులు అత్యుత్సాహం కనబర్చడంతో విజయ్‌ దేవరకొండ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ లైగర్. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు విజయ్ దేవరకొండ . ఇప్పటికే ఈ హీరోకు నార్త్‏లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఉత్తరాదిలోని పలు ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్, పాట్నా ప్రాంతాల్లోని పలు మాల్స్‏లో నిర్వహించిన వేడుకలకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

తాజాగా పుణెలో నిర్వహించిన ఈవెంట్‌లోనూ ఇదే క్రేజ్‌ కొనసాగింది. ఓ షాపింగ్‌మాల్‌ మొత్తం అభిమానులతో నిండిపోయింది. అదే సమయంలో స్టేజ్‌పైకి చేరుకున్న విజయ్‌ – అనన్యలను చూసి అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు. స్టేజ్‌ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ హీరోహీరోయిన్ల దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని కంట్రోల్‌ చేయడం కష్టమని భావించిన సెక్యురిటీ సిబ్బంది ఇదే విషయాన్ని విజయ్‌-అనన్యకు చెప్పి వారిద్దర్నీ అక్కడి నుంచి పంపించి వేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమాను ఆగస్ట్ 25న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఇక ఈరోజు (ఆగస్ట్ 12న) సాయంత్రం 4 గంటలకు కోకా 2.0 సాంగ్ విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు.