మిడిల్ క్లాస్ ఫండ్ ఖర్చులు ఇలా.. విజయ్ దేవరకొండ రిపోర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మిడిల్ క్లాస్ ఫండ్ ఖర్చులు ఇలా.. విజయ్ దేవరకొండ రిపోర్ట్

June 2, 2020

vijay

లాక్‌డౌన్ వేళ మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడానికి టాలీవుడ్ సంచలన హీరో విజయ్ దేవరకొండ సాయం చేస్తున విషయం తెలిసిందే. పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. కానీ, జీతాలు లేక.. వేరొకరిని సాయం అడగలేక ఇబ్బంది పడే మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి అని విజయ్ ఆలోచించారు. అలాంటి వాళ్లకు కొంతైనా సాయం అందించాలని అనుకున్నారు. వారి కోసం మిడిల్ క్లాస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి తాను స్వయంగా రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ ఫండ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసరాలు అందజేసేలా ప్లాన్ చేసుకుని, ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. దీని ద్వారా సాయం కోరిన వారికి సరుకులు అందజేశారు. ముందుగా తమ పేరు ఎన్‌రోల్ చేసుకున్నవారు కిరాణా షాపుకు వెళ్లి సరుకులు తీసుకున్నాక, ఆ షాపతని నంబర్ చెబితే గూగుల్ పేలో డబ్బులు పంపేలా ఏర్పాటు చేశారు. 

ఈ లెక్కలన్నింటినీ ప్రతిరోజూ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసేవారు. మొత్తం 36 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్‌ను తాజాగా విజయ్ దేవరకొండ వెల్లడించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో.. దేవరకొండ ఫౌండేషన్‌లో భాగంగా ఏర్పాటుచేసిన ఈ మిడిల్ క్లాస్ ఫండ్‌కు విరాళాలు కూడా భారీ ఎత్తున వచ్చాయి. మొత్తం 8,515 మంది దాతలు విరాళాల కింద రూ. 1,50,24,549 మిడిల్ క్లాస్ ఫండ్‌కు అందజేశారు. మొత్తంగా రూ. 1,71,21,103 ఫండ్‌తో 17,723 కుటుంబాలకు సాయం అందించారు. ఈ సాయం ద్వారా ఆయా కుటుంబాల్లోని 58,808 మంది లబ్ధి పొందారు. ఈ సాయాన్ని అందించడానికి 535 మంది వాలంటీర్లు పనిచేశారు. కాగా, దాతలందరికీ విజయ్ దేవరకొండ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, ఈ మిడిల్ క్లాస్ ఫండ్ ఇలానే కొనసాగుతుందని.. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సాయం కోరవచ్చుని విజయ్ లేఖలో పేర్కొన్నారు.