లైగర్ సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్న రౌడీ హీరో విజయదేవరకొండకు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి. లైగర్ చిత్రం పెట్టుబడులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విజయదేవర కొండను విచారించింది. ఇప్పటికే దీనిపై డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను విచారించగా బుధవారం విజయదేవరకొండను ప్రశ్నించింది. సుమారు 12 గంటలకు పాటు అతనిని ఈడీ అధికారులు ఆరా తీశారు. ఉదయం 8:30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు.
పాపులారిటీతోనే సైడ్ ఎఫెక్ట్స్..
విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు విజయ్ విలేకరులతో మాట్లాడారు. పాపులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటివి రావడం సహజమేనన్నారు. అప్పుడప్పుడు సైడ్ ఎఫెక్టులు ఎదురవుతాయని తెలిపారు. జీవితంలో ఇదొక అనుభవమన్నారు రౌడీ. ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. లైగర్ సినిమా లావాదేవీలపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారని.. మళ్ళీ విచారణకు పిలవలేదని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.
మనీలాండరింగ్ అనుమానాలు
“లైగర్” సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు మనీలాండరింగ్ చేశారనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించి విచారణ చేపడుతుంది. దుబాయికి డబ్బులు పంపించి, అక్కడి నుంచి తిరిగి సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మిని అధికారులు ప్రశ్నించగా. బుధవారం విజయ్ దేవరకొండను విచారించింది.ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.