Vijay Mallya sentenced to 4 months in jail, fined Rs.2 thousand: Supreme Court
mictv telugu

విజయ్ మల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా: సుప్రీంకోర్ట్

July 11, 2022

ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష, రూ.2000 జారిమానను విధిస్తూ, నేడు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ శిక్షకు ప్రధాన కారణాన్ని కూడా కోర్టు తెలియజేసింది. 2017లో క‌ర్ణాట‌క హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి, విదేశాల్లో ఉన్న త‌న కుమారుడు సిద్ధార్థ్ మాల్కా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాల‌కు 40 మిలియ‌న్ డాల‌ర్లను (భారత కరెన్సీలో దాదాపు రూ. 317కోట్లు) ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి విజయ్ మాల్యా బ‌దిలీ చేశారని, ప్రభుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌దు బ‌దిలీ చేయటం కారణంగా ఈ శిక్షను ఖరారు చేసినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

విజయ్ మల్యాపై గతంలో రుణాల ఎగవేతకు సంబంధించి ఎస్‌బీఐ ఆధ్వర్యంలో బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాంతో 2017లో బ్యాంకుల కన్సార్టియం నిబంధలకు విరుద్దంగా ఆయన చేసిన నగదు బదిలీ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో, సుప్రీంకోర్ట్ అతనిపై ధిక్కరణ చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ, మాల్యా పిటిషన్ దాఖలు చేశారు. దాంతో 2020 ఆగస్టులో కోర్టు దాన్ని తిరస్కరించింది. ఆయన కోర్టు ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసిన మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో మరోసారి విచారించిన న్యాయస్థానం.. ఈ ఏడాది మార్చి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టి నేడు తీర్పును వెల్లడించింది. మాల్యా తన పిల్లలకు బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్ల నగదును నాలుగు వారాల్లోగా వడ్డీతో సహా కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

మరోపక్క విజయ్ మల్యా.. కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, బ్యాంకులకు టోపీ పెట్టి లండన్‌కి పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. గతకొన్ని సంవత్సరాల నుండి ఆయన లండన్‌లోనే ఉంటున్నారు. మల్యాను ప్రభుత్వాలు ఇండియాకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. చేస్తున్న ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కావడం లేదు. ఈ క్రమంలో తాను ఇండియాలో బ్యాంకుల వద్ద చేసిన అప్పులన్నీ తీర్చేస్తానని అని, ప్రభుత్వాలు ఆయా బ్యాంకులు తన మాటను అంగీకరించటం లేదని ఇండియాకు రాకుండా మల్యా తప్పించుకొని తిరుగుతున్నారు.