తమిళుల గొడవ సక్సెస్.. 800 నుంచి విజయ్ సేతుపతి ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

తమిళుల గొడవ సక్సెస్.. 800 నుంచి విజయ్ సేతుపతి ఔట్

October 19, 2020

చాలా సినిమాలు షూటింగ్ ముగించుకుని విడుదల అయ్యాక వివాదాలు చుట్టుముట్టుకుని విడుదలకు నోచుకోవు. లేదంటే ఆ సినిమాలోని అభ్యంతర సన్నివేశాలను తొలగించి సినిమాను థియేటర్లలో నడిపిస్తారు. మరికొన్ని సినిమాలు సెన్సార్ గడపలోనే ఆగిపోతుంటాయి. అయితే ఓ సినిమా విషయంలో తమిళులు ఏదైతే కోరుకున్నారో అందులో వారు విజయం సాధించారు. ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి ‘800’ సినిమా నుంచి తప్పుకున్నారు. ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మురళి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే శ్రీలంకలో తమిళులను ఊచకోత కోసినప్పుడు అక్కడి ప్రభుత్వానికి మురళి మద్దతుగా ఉన్నాడు. దీంతో మురళి పాత్రలో విజయ్ నటించవద్దని తమిళులు కోరారు. ఈ నేపథ్యంలో, సినిమా నుంచి తప్పుకోవాలని మురళీధరన్ కూడా సూచించారు. దీంతో, సినిమా నుంచి విజయ్ స్వచ్ఛందంగా పక్కకు వచ్చేశారు.  

ఈ సందర్భంగా ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న మురళీధరన్ ప్రకటన చేశాడు. ‘నా బయోపిక్ 800పై ఒక దురభిప్రాయంతో ఈ చిత్రం నుంచి తప్పుకోవాలని పలువురు విజయ్ సేతుపతిపై ఒత్తిడి తెచ్చారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన నటుల్లో ఒకడైన విజయ్ ఇబ్బందుల్లో పడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాలని విజయ్‌కు సూచిస్తున్నా. ఈ సినిమా వల్ల విజయ్ సినీ కెరీర్‌కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ఇబ్బందుల వల్ల నేనెప్పుడూ అలసిపోలేదు. ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులను ఎదుర్కోవడం వల్ల మాత్రమే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందనే ఉద్దేశంతోనే నేను ఈ బయోపిక్‌కు అంగీకారం తెలిపాను. ప్రస్తుత ఇబ్బందుల నుంచి నిర్మాతలు బయటపడతారని భావిస్తున్నాను. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని నిర్మాతలు నాకు చెప్పారు. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. ఈ సినిమాలోని పాత్రధారులను మార్చే పనిలో నిర్మాతలు ఉన్నారు. త్వరలోనే నా బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ ఇబ్బందికర సమయంలో నాకు అండగా నిలిచిన మీడియాకు, రాజకీయ నాయకులకు, విజయ్ అభిమానులకు, ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నాను’ అని సోషల్ మీడియాలో మురళీధరన్ పేర్కొన్నాడు. మురళి వ్యాఖ్యలను విజయ్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘థాంక్యూ అండ్ గుడ్ బై’ అని ట్వీట్ చేశారు.