Vijay Varasudu Movie Review
mictv telugu

వారసుడు రివ్యూ

January 14, 2023

Vijay Varasudu Movie Review

దిల్ రాజు నిర్మాతగా తమిళ్ లో నిర్మించిన మొదటి చిత్రమే అయినా విడుదలకు కొన్నిరోజుల ముందు నుంచే వివాదాలతో వార్తల్లో నిలిచింది. తమిళంలో పదకొండునే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. తెలుగులో మాత్రం ఈ శనివారం థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి టాక్ సాధించింది?

కథ విషయానికొస్తే..

ప్రముఖ పారిశ్రామికవేత్తగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకున్న రాజేంద్ర(శరత్ కుమార్)కి ముగ్గురు కొడుకులు. జై(శ్రీకాంత్) అజయ్ (కిక్ శ్యామ్) విజయ్ (విజయ్). తన సంస్థలకు వారసుడిగా ఈ ముగ్గురిలో ఒకరిని ప్రకటించాలనుకుంటాడు. కానీ ఈ పైసా రేస్ నచ్చని విజయ్ తండ్రి మీద కోపంతో ఇంటినుంచి బైటికెళ్తాడు. మరోవైపు బిజినెసులో రాజేంద్రని దెబ్బతీయాలని ప్రత్యర్థయిన జయ ప్రకాష్(ప్రకాష్ రాజ్) రాజేంద్రపై కుట్రలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జై, అజయ్ ల తప్పులు, లోపాలు తండ్రి కంటపడకుండా చేస్తున్న బాగోతాలు రాజేంద్రకు తెలిసేలా చేసి వాళ్లిద్దర్నీ తనకు దూరం చేస్తాడు. దీంతో కుటుంబాన్ని కలపడంతో పాటు, తండ్రి వ్యాపారాన్ని సక్రమంగా నడిపించడానికి విజయ్ ఎలా రంగంలోకి దిగాడు? ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? కుటుంబసభ్యుల మధ్యున్న దూరాన్ని ఎలా తగ్గించి అందర్నీ ఒక్కటి చేశాడనేదే అసలు కథ.

కథనం ఎలా ఉందంటే..

చెప్పుకోడానికి ఇదేమీ గొప్ప కథేమీ కాదు. ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో చాలా చాలా సార్లు చూసేసి ఉన్న పాత పచ్చడే. కానీ విజయ్ లాంటి స్టార్ ఈ మూవీలో హీరోగా చేయడంతో లెక్కకు మించి ఎలివేషన్ సీన్లు, ఇబ్బందిగా ఇరికించిన ఫైట్ సీన్లు, పండగ సీజన్లో ఫ్యామిలీ ఆడియెన్సును ద్రుష్టిలో పెట్టుకుని రాసుకున్న సీరియల్ టైప్ సెంటిమెంట్ సీన్లతో అలా సా..గి పోతుంది. కథపరంగా గానీ, టెక్నికల్ పరంగా గానీ ఏమాత్రం కొత్తదనం ఊహించినా సగటు ప్రేక్షకుడిగా అది పెద్ద పాపమే అవుతుందని చెప్పాలి. కేవలం తమిళ విజయ్ ఫ్యాన్సు వరకే ఎంటర్టెయిన్ ఫీలయ్యే ఎలిమెంట్స్ తో నిండిపోవడంతో తెలుగు ఆడియెన్స్ అసలు కన్సిడర్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఇక మధ్య మధ్యలో కుటుంబం, బంధాలు, అనుబంధాలంటూ కొన్ని అతకని సెంటిమెంట్ సీన్స్ పెట్టినా పెద్దగా అన్ని రకాల ప్రేక్షకులకి కనెక్టయ్యే స్థాయిలో అయితే లేవు.

ఎవరెలా చేశారంటే..

ఒక ఫ్యామిలీ యాక్షన్ అండ్ కమర్షియల్ కథ కావడంతో హీరో విజయ్ అన్ని రకాలుగా తన ప్రయత్నం చేశాడు. తమిళ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టు… డ్యాన్స్ వేనుమా, డ్యాన్స్ ఇరుక్కు.. పైట్స్ వేనుమా, ఫైట్స్ ఇరుక్కు.. విజయ్ సార్ బాడీ లాంగ్వేజ్ సీన్స్ వేనుమా.. ఆ సీన్స్ ఇరుక్కు.. ఇలా విజయ్ వన్ మ్యాన్ షో నడుస్తుంది. రష్మికకి కేవలం పాటలు, డ్యాన్సులు తప్ప పాత్ర పరంగా, నటన పరంగా స్కోప్ లేదు. సాంగ్స్ వచ్చినప్పుడల్లా.. ఓ కథలో రష్మిక ఉంది కదా అని ఆడియెన్సుకు గుర్తొస్తుంటుంది. పాటైపోగానే పొరపాట్న కూడా మళ్లీ గుర్తొచ్చే ప్రమాదం లేదు. థమన్ పాటల్లో ఒక్క రంజితమే తప్ప మిగతా ఏ పాట పెద్దగా గుర్తు కూడా ఉండదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తనదైన స్టయిల్లో బానే ఇచ్చే ప్రయత్నం చేశాడు. టెక్నికల్ విషయాలకొస్తే మేకింగ్ పరంగా ఇళ్లు, ఆఫీస్, ఓ మైన్.. ఇలా నాలుగుయిదు లొకేషన్లలోనే సినిమా షూట్ అంతా సాగింది. కానీ చాలా వరకు గ్రీన్ మ్యాట్ సీన్లే అని తెరమీద తెలిసిపోయి ఆడియెన్సుకి ఫీల్ తేలిపోతుంది. ఇక మిగతా పాత్రలైన ప్రభు, జయసుధ, యోగిబాబు.. ఇలా ఎవరి రోల్స్ వాళ్లు చేసేశారు.

ఓవరాల్ గా ఎలా ఉందంటే..

పేరుకి ఫ్యామిలీ ఎంటర్టెయినరే అయినా.. సీన్ల నిండా ఫ్యామిలీ ఉంటుంది.. కానీ ప్రేక్షకుడు కోరుకునే విధంగా పెద్దగా ఎంటర్టెయిన్మంటయితే కష్టమే. దర్శకుడు వంశీ పైడిపల్లి నాలుగయిదు తెలుగు సినిమాలను కలిపి చేసిన కిచిడీనే అయినా తమిళ ఫ్లేవర్ గుప్పుమనే సాంబారే వారసుడు.